Hyderabad Drug Bust: పక్కగా సేకరించిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు కీసర పోలీసులతో కలిసి డ్రగ్ పెడ్లర్‌ను (Hyderabad Drug Bust) అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి కోటి రూపాయల విలువ చేసే 7కిలోల ఓపీఎం, 2కిలోల పాపీస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda Commissioner Sudheer Babu) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ రాష్ట్రం ఛిత్తోర్ ఘడ్ చార్ భుజా మందిర్ ప్రాంత నివాసి లోకేశ్ బరెత్ (26) 10వ తరగతి వరకు చదివాడు. ఆ తరువాత ఓ దుస్తుల దుకాణంలో సేల్స్ బాయ్ గా పని చేశాడు. అక్కడ ఉద్యోగం మానేసి డామినోస్ పిజ్జాలో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఉదయ్ పూర్ లో షార్ట్ టర్మ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చదివాడు. అనంతరం ఉదయ్ పూర్ లోనే ఉన్న గోల్డెన్ పామ్ హోటల్ లో మేనేజర్ గా చేరాడు.
Also Read: Drug Racket: మరో సక్సెస్ సాధించిన ఈగల్.. ఎన్ని కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారంటే?
మాదక ద్రవ్యాలను హైదరాబాద్, చెన్నైలకు తీసుకెళుతూ
ఆ తరువాత కొన్ని రోజులకే హోటల్ యాజమాన్యం మారటంతో ఉద్యోగం కోల్పోయాడు. పని కోసం వెతుక్కుంటున్న క్రమంలో అతనికి రాజస్తాన్ కే చెందిన జగదీష్ గుజ్జర్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే డ్రగ్స్ దందా చేస్తున్న జగదీష్ గుజ్జర్ సలహాతో లోకేశ్ కూడా అదే పని మొదలు పెట్టాడు. రాజస్తాన్ నుంచి ఓపీఎం, పాపీస్ట్రా మాదక ద్రవ్యాలను హైదరాబాద్, చెన్నైలకు తీసుకెళుతూ అమ్ముతూ వస్తున్నాడు. ఆగస్టు నెలలో ఇలాగే హైదరాబాద్ వచ్చి 2 కిలోల ఓపీఎంను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తికి విక్రయించి వెళ్లాడు. ఇక, జగదీష్ గుజ్జర్ సూచనల మేరకు ఈనెల 8న 7కిలోల ఓపీఎం, 2 కిలోల పాపీస్ట్రాతో రాజస్తాన్ నుంచి రైల్లో బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నాడు.
ఈ కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష
వీటిని డెలివరీ ఇవ్వటానికి కీసర స్టేషన్ పరిధిలోని కుందన్ పల్లి ఓఆర్ఆర్ రోటరీ వద్దకు వచ్చాడు. ఈ మేరకు సమాచారం సేకరించిన మల్కాజిగిరి ఎస్వోటీ సీఐ జానయ్య, ఎస్ఐ సాయికుమార్, కీసర సీఐ ఆంజనేయులుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి లోకేశ్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జగదీష్ గుజ్జర్ కోసం గాలింపు చేపట్టారు. కాగా, డ్రగ్స్ దందా చేసినా, రవాణా చేసినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్ 31ఏ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చని చెప్పారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్వోటీ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి, ఏసీపీ అంజయ్య పాల్గొన్నారు.
Also Read: Amazing Facts: ఒక నిముషం సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ధూల్ పేటలో గంజాయి సీజ్
గంజాయి విక్రయాలు జరుగుతున్న ఇంటిపై ఎక్సయిజ్ స్ టాస్క్ ఫోర్స్ ఏ టీం పోలీసులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 1.240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లోయర్ ధూల్ పేట ఇమ్లీబాగ్ లో వీరేందర్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోనే గంజాయి నిల్వ చేసి అమ్ముతున్నట్టు సమాచారం అందటంతో సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి జరిపారు. వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. ఇదే కేసులో కమలేశ్ బాయి, నందిని బాయి, అనిత బాయి, రాధిక, రచన బాయిలపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్
