Indian Origin Shot Dead: అమెరికాలోని పిట్స్ బర్గ్ లో గతవారం భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఓ మోటెల్ లో మేనేజర్ గా వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రాకేష్ ఎహగబ (Rakesh Ehagaba) ను నిందితుడు పాయింట్ బ్లాంక్ లో కాల్చేశాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి.. తాజాగా షాకింగ్ విషయం ఒకటి వెలుగులు చూసింది. ‘నువ్వు బాగానే ఉన్నావా?’ అని ఎంతో సౌమ్యంగా ప్రశ్నించినందుకు రాకేష్ ను నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
పిట్స్ బర్గ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకేష్ ఎహగబ శుక్రవారం 37 ఏళ్ల స్టాన్లీ యూజిన్ వెస్ట్ (Stanley Eugene West) అనే వ్యక్తి హత్య చేశాడు. మోటెల్ బయట జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు యత్నించి.. రాకేష్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మోటెల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. నిందితుడు చేతిలో తుపాకీ పట్టుకొని ఉన్నాడు. అప్పుడు అతడి వద్దకు వచ్చిన రాకేష్.. ‘నువ్వు బాగానే ఉన్నావా?’ (Are You Okay?) ప్రశ్నించాడు. దీంతో నిందితుడు అతడి వైపు కోపంగా నడుస్తూ వచ్చి.. తుపాకీని అతడి తలపై ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు వివరించారు.
పోలీసులపైనా కాల్పులు
అంతకుముందు నిందితుడు వెస్ట్ ఓ మహిళపైనా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని పిట్స్ బర్గ్ లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో గుర్తించినట్లు చెప్పారు. అయితే అతడ్ని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపాడని.. తాము కూడా ఎదురుకాల్పులు జరిపి చివరికి వెస్ట్ ను అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. తాము జరిపిన కాల్పుల్లో వెస్ట్ గాయపడటంతో అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై హత్య ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు పిట్స్ బర్గ్ పోలీసులు వెల్లడించారు.
Also Read: Rajasthan News: ఆస్పత్రిలో ఘోరం.. ఐసీయూలో చెలరేగిన మంటలు..ఆహుతైన అగ్నికి పేషెంట్లు
ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందంటే?
నిందితుడు వెస్ట్ పిట్స్‌బర్గ్ మోటెల్‌లోనే ఉంటున్నాడు. ఆ మహిళ గత రెండు వారాలుగా అక్కడ ఒక చిన్నారితో కలిసి గెస్ట్ గా జీవిస్తోంది. గత శుక్రవారం ఆమె తన బ్లాక్ కలర్ కారులో మోటెల్ నుంచి వెళ్లబోతుండగా.. నిందితుడు వెస్ట్ వచ్చి డ్రైవర్ సీటు వైపు కాల్పులు జరిపాడు. దీంతో ఓ బుల్లెట్ ఆమె మెడను తాకుతూ దూసుకెళ్లింది. అయితే కారులోని చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే కాల్పుల శబ్దం విని రాకేష్ ఎహగబ బయటకు వచ్చాడు. ఆ సమయంలో వెస్ట్ అతడిపై కాల్పులు జరిపి చంపాడు. అనంతరం నిందితుడు ఒక వాన్ దగ్గరికి వెళ్లి ఎలాంటి భయం లేకుండా దానిని నడిపి అక్కడి నుంచి పారిపోయాడు.
