Hyderabad: హైదరాబాద్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి మళ్లీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నాం మూడు గంటలకు ఈ రిజర్వాయర్ల గేట్లను ఎత్తినట్లు జలమండలి వెల్లడించింది. ఉస్మాన్ సాగర్ కు చెందిన ఆరు గేట్లను నాలుగు అడుగుల మేరకు, హిమాయత్ సాగర్ కు చెందిన మరో రెండు గేట్లను మూడు అడుగల మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
మూసీలోకి 4వేల క్యూసెక్కులు విడుదల
600 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్న ఉస్మాన్ సాగర్ నుంచి 2 వేల 652 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే 400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్న హిమాయత్ సాగర్ నుంచి 1981 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు జలాశయాల నుంచి మొత్తం 4 వేల 28 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదలుతున్నారు. ఇటీవల కూడా జలాశయాల్లోకి భారీగా వరద నీరు రావటంతో రెండు జలాశయాల 24 గేట్లను ఎత్తి దిగువకు ఏకంగా 34 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతంలోని నాలుగు బస్తీలు నీట మునిగాయి. వీటితోపాటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరింది. శనివారం మరోసారి రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయటంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read: Tragedy News: డల్లాస్లో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
రిజర్వాయర్ల నీటి మట్టాలు
ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1789.35 అడుగులు (3751 టీఎంసీలు), కాగా, హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.95 అడుగులు( 2780) టీఎంసీలకు చేరింది. జలాశయాల నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరటం, ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో పాటు తాజాగా ఎగువ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయటంతో వరద నీటి ఇన్ ఫ్లో బాగా పెరిగే అవకాశమున్నందున, జలమండలి అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా శనివారం ఈ రెండు రిజర్వాయర్ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.
