Tragedy News: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థి చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం.. జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు మృతుని కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని బీఎన్ రెడ్డినగర్ నివాసి చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి 2023లో ఉన్నత విద్యల కోసం అమెరికాలోని డల్లాస్ కు వెళ్లాడు. ఆరునెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశాడు కూడా. అక్కడే ఫుల్ టైం ప్లేస్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈలోపు ఖర్చుల కోసమని ఓ ఫిల్లింగ్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి చంద్రశేఖర్ డ్యూటీలో ఉండగా ఓ దుండగుడు ఫిల్లింగ్ స్టేషన్ కు వచ్చాడు. దోపిడీ చేసే క్రమంలో చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలకు గురైన చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు.
Also Read: Hyderabad Crime: సొంత చెల్లెలిపై కక్ష.. మేనకోడల్ని చంపిన కిరాతకుడు.. వెలుగులోకి సంచలన నిజాలు
భౌతక కాయాన్ని తెప్పించేందుకు చర్యలు
కొడుకు మరణవార్త విని.. చంద్రశేఖర్ తల్లిదండ్రులు దుఖంతో కుప్పకూలిపోయారు. విషయం తెలిసిన మాజీ మంత్రి హరీష్ రావు మలక్ పేట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి వారిని ఓదార్చారు. దళిత విద్యార్థి దుండగుల కాల్పుల్లో చనిపోవటం విషాదమని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా చంద్రశేఖర్ భౌతిక కాయం స్వస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, దుండగులు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ చనిపోవటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేశారు. వీలైనంత త్వరగా చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని తెప్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
