Sama Ram Mohan Reddy: మాజీ మంత్రి హరీష్ రావు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్డ్ అనే సమస్యను కలిగి ఉన్నట్లు ఆరోపించారు. ఇది మనుషుల్లో మాత్రమే కనిపించే ఒక అరుదైన డిజార్డర్ (రుగ్మత) అని వివరించారు. ఈ డిజార్డర్ ఉన్నవారు, హరీశ్‌రావులాగా తమకు తామే చాలా గొప్పగా ఊహించుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ ప్రపంచాన్ని, ప్రజలను కాపాడుతున్నది తామేనని భావిస్తారని వెల్లడించారు. అవతలి వ్యక్తులు చేసే ప్రతి పనినీ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారన్నారు. ఏదైనా మంచి జరిగితే, దాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించడం ఈ డిజాస్టర్ స్పెషాలిటీ అంటూ వివరించారు. అంతేగాక ఎన్ని అబద్దాలైనా నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతారన్నారు. ఈ తరహా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్డ్ ఉన్న వ్యక్తుల్లో కేసీఆర్ ఒకటో నంబరైతే, హరీశ్ రావు రెండో నంబర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.నోటికొచ్చిన అబద్ధాన్ని అందంగా, అందరూ నమ్మేలా చెప్పడంలో గోబెల్స్‌ని మించిన వంచకులు వీరిద్దరని మండిపడ్డారు.
ఏ జిల్లాలో నిమ్స్ కట్టారో?
ఓవైపు టిమ్స్ హాస్పిటళ్లను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంటే.. పబ్లిసిటీ కోసం హరీశ్‌రావు పాకులాడుతున్నాడని విమర్శించారు. 2014 నుంచి 2023 చివరి వరకూ అధికారంలో ఉన్నది వాళ్లేనని వివరించారు. జిల్లాకో నిమ్స్ హాస్పిటల్ కడుతామని 2014 మేనిఫెస్టోలో పెట్టారని, కానీ ఏ జిల్లాలో నిమ్స్ కట్టారో? హరీష్ రావు చూపించాలన్నారు. 2016 ఫిబ్రవరిలో, అప్పటి గవర్నర్ ఈఎస్‌ఎల్ఎన్ నరసింహన్ గాంధీ హాస్పిటల్‌లో పర్యటించి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీంతో హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను కేసీఆర్ అప్పటికప్పుడు ప్రకటించారని వివరించారు. మళ్లీ 2020లో కరోనా వచ్చే వరకు కూడా ఆరోగ్యశాఖను, హాస్పిటళ్లను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కోవిడ్ వచ్చాక నగరం చుట్టూ 4 టిమ్స్‌లు అంటూ.. పాత హామీనే కొత్తగా ప్రకటించారన్నారు. గచ్చిబౌళి స్టేడియానికి సంబంధించిన ఓ భవనానికి టిమ్స్ అని బోర్డు తగిలించారని గుర్తు చేశారు. నాలుగు టిమ్స్‌ల్లో ఒక టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ జబ్బలు చరుచుకున్నారన్నారు.
‘పబ్లిసిటీ డ్రామాలు’
కోవిడ్ తగ్గగానే గచ్చిబౌళి టిమ్స్ మూత పడేశారన్నారు. ఇక మిగిలిన 3 టిమ్స్‌ల గురించి 2022 వరకూ అసలు ఊసే లేదన్నారు.ప్రజలతో పాటు గతంలోని ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రశ్నించడంతో 2022 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి హడావుడిగా శంకుస్థాపన చేశారన్నారు. హాస్పిటళ్ల పేరుతో భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేశారన్నారు. 2023 చివరి వరకూ అధికారంలో వాళ్లే ఉన్నారన్నారు. 2023లో ఎన్నికలు పూర్తయ్యే నాటికి కనీసం సగం పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. కానీ, నిర్మాణ వ్యయం అంచనాలను అడ్డగోలుగా పెంచేసి జేబులు నింపుకున్నారన్నారు.. ఓవైపు అత్యాధునిక వసతులతో టిమ్స్‌లను తీర్చిదిద్దే పనిలో తమ ప్రభుత్వం ఉంటే, హరీశ్‌రావు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారన్నారు. ఎల్బీనగర్‌కు వెళ్లి ఏదో షో చేసి, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారన్నారు. బీఆర్ ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు నెలకు సగటున 57 కోట్లు ఇస్తే, తాము ప్రస్తుతం నెలకు వంద కోట్లు చెల్లిస్తున్నామన్నారు. హాస్పిటళ్ల సంఖ్య పెంచడంతో పాటు ప్రొసీజర్ల సంఖ్య పెంచామన్నారు. రూ.5 లక్షల లిమిట్‌ను రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు పునర్వైభవం తీసుకొచ్చే పనిలో తాము ఉంటే, ప్రభుత్వ హాస్పిటళ్లను బదనాం చేస్తూ, శవాల మీద పేలాలు ఏరుకునే పనిలో బీఆర్ ఎస్ ఉన్నదని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
Also Read: Local Body Elections: హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. వీణవంక జెడ్పీటీసీ టికెట్ కోసం కోల్డ్ వార్!
‘అతడో రాజకీయ దొంగ’
ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ ప్రిపేయిడ్ రిచార్జ్ లాంటివాడని, ఒక రాజకీయ చోర్ అంటూ సామ ఫైర్ అయ్యారు. ఎంత రిచార్జ్ చేస్తే, అంత టాక్ టైమ్ లాగా ఆయన వ్యవహరిస్తారన్నారు. బీహర్ ప్రజల సంక్షేమం కోసం తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీసం 15 నిమిషాలు కూడా మాట్లాడలేదన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా కోట్లు సంపాదించారని, కానీ పార్టీలనుగెలిపించలేకపోయాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి, సీన్ ప్రశాంత్ కిషోర్ కు లేదన్నారు.
