Kisan Vikas Patra Scheme: ఇంటి ఖర్చులు పెరుగుతూ.. పొదుపులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మంచి స్కీమ్ అందుబాటులో ఉంది. దాని పేరు కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra – KVP). దశాబ్దాల కాలంగా దేశంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న పొదుపు పథకం ఇదే కావడం విశేషం. మీరు పెట్టే పెట్టుబడికి నిర్ణీత కాలం తర్వాత డబుల్ రిటర్న్స్ ఇస్తుండటం ఈ స్కీమ్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (KVP)..
కిసాన్ వికాస్ పత్రను 1988లోనే ప్రారంభమైంది. దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే అనతికాలంలోనే ఈ స్కీమ్ ప్రజలకు బాగా చేరువైంది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ మంది వినియోగిస్తున్న సేవింగ్స్ స్కీమ్ గా ఇది నిలించింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. లాభాల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
రూ.1000 నుంచి ఎంతైనా..
కిసాన్ వికాస్ పత్ర పథకం విషయానికి వస్తే.. ఇందులో కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా ఎంతైన పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ఖాతాదారుల పెట్టుబడిపై ఏటా 7.5% వడ్డీ లభించనుంది. 115 నెలల (9 ఏళ్ల 7 నెలలు) కాలానికి ఈ పథకం కింద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన వెంటనే మీరు పెట్టిన అసలుకు రెట్టింపు నగదును కలిపి మీకు అందిస్తారు. అయితే ఈ పథకంలో చెప్పుకోవాల్సిన మరో విశేషమేంటంటే.. చక్రవడ్డీని కూడా మీ పెట్టుబడికి కలుపుతారు. అంటే ప్రతీ ఏటా వచ్చే వడ్డీని మూలధనంతో కలిపి మెుత్తానికి మళ్లీ వడ్డీని లెక్కించడం జరుగుతుంది.
పెట్టుబడి ఎలా పెట్టాలి?
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెట్టదలుచుకున్నవారు ముందుగా సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై స్కీమ్ కు సంబంధించిన ఫామ్ ను నింపాలి. ముందుగా Form A లో పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు ఇవ్వాలి. పెట్టుబడి మొత్తం, చెల్లింపు విధానం, నామినీ వివరాలు నమోదు చేయాలి. అవసరమైన KYC పత్రాలు (ఐడీ ప్రూఫ్, చిరునామా ప్రూఫ్, ఫోటోలు) జోడించాలి. తొలుత రూ.50,000 వరకు నగదుగా చెల్లించవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాలంటే చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా RTGS/NEFT అవసరం అవుతాయి. ధృవీకరణ అనంతరం మీకు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. దీన్ని గడువు వరకు భద్రంగా ఉంచుకోవాలి.
అవసరమైన పత్రాలు
ఐడీ ప్రూఫ్: ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్
చిరునామా ప్రూఫ్: ఆధార్, పాస్‌పోర్ట్, యుటిలిటీ బిల్, బ్యాంక్ పాస్‌బుక్
ఫోటో: పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
PAN కార్డు: రూ.50,000 పైగా పెట్టుబడులకు తప్పనిసరి
ఆదాయం రుజువు: రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడికి శాలరీ పే స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఐటీఆర్ అవసరం
Also Read: Local Body Elections: బండి వర్సెస్ ఈటల.. మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. బీజేపీ తర్జన భర్జన
రూ.20 లక్షలు ఎలా పొందొచ్చు?
మీరు ఒకే సారి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటుతో ఇది ప్రతీ ఏడాది చక్రవడ్డీగా పెరుగుతూ ఉంటుంది. 115 నెలల చివర్లో అది సుమారు రూ.20 లక్షలు అవుతుంది. అంటే పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేస్తుందన్నమాట. ఇదిలా ఉంటే ఆర్థిక నిపుణులు సైతం కేవీపీ స్కీమ్ ను సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా పేర్కొంటున్నారు. మార్కెట్ రిస్క్‌లకు గురికాకుండా పెట్టుబడులను సంరక్షించుకోవచ్చని పేర్కొంటున్నారు. వేగంగా లాభాలు అందించకపోయినా.. ఆర్థిక భద్రత, క్రమశిక్షణాత్మక పొదుపులు, స్థిరమైన రాబడులను ఈ స్కీమ్ ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు.
