Local Body Elections: తెలంగాణ బీజేపీలో కీలక పరణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండిసంజయ్, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ ల మధ్య విభేదాలు ఇప్పుడు మరోమారు తారాస్థాయికి చేరుకున్నాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయం లో మొదలైన వివాదం రోజురోజుకు ముదురిపోతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వర్గపోరు నడుస్తుండగా ఆ మధ్య ఇరువురు నేతలు పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్ కి దిగారు. ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్న వేళ మరోమారు విభేదాలు భగ్గుమనడం రాష్ట్ర నాయకత్వాన్ని టెన్షన్ పెడుతోంది.
రెండు గ్రూపులుగా విడిపోయి..
ప్రస్తుతం బీజేపీలో ఉన్నది మోదీ గ్రూప్ ఒక్కటే అని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతూ వస్తుంటారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి.. రెండు గ్రూపులుగా ఆ పార్టీ విడిపోయింది. అది కూడా బండి, ఈటల వర్గాలుగా బీజేపీ శ్రేణులు చీలిపోయారు. ప్రస్తుతం ఇదే ఈటల రాజేందర్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. తనను నమ్మి బీజేపీలోకి వచ్చిన అనుచరులకి విలువ లేకుండా పోతుందోనని ఈటల నిత్యం అగ్రహావేశాలతో రగిలిపోతున్నారట. వాస్తవానికి ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడింది.
‘నా వాళ్లే పోటీ చేస్తారు’
అయితే జిల్లా, మండల కమిటీల నియామకంలో ఈటల రాజేందర్ అనుచరులకి ప్రాతినిధ్యం దక్కకపోచడంతో అప్పట్లో ఆయన చాలా ఘాటుగానే విమర్శలు చేశారు. ‘నా చరిత్ర నీకు తెలియదు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఅర్ లాంటి వారితోనే కొట్లాడినోన్ని. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ, వార్డుమెంబర్లుగా నావాళ్లే ఉంటారు’ అని పరోక్షంగా బండిని హెచ్చరించారు. ఈ క్రమంలో దసరా పండుగకి కమలాపూర్ లోని ఇంటికి వచ్చిన ఈటల రాజేందర్ ని తన అనుచరులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే టికెట్ రాకపోతే ఎవ్వరూ బాధపడవద్దని అవసరమైతే అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీ నుండి టికెట్ ఇప్పించి గెలిపించుకుంటానని ఈటల హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి.
Also Read: Instagram CEO: యూజర్ల మాటలను ఇన్‌స్టాగ్రామ్ చాటుగా వింటోందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యాప్ సీఈఓ
‘ఈటల.. వ్యక్తిగత దుకాణం కాదు’
జాతీయపార్టీ బీజేపిలో ఉంటూ మరో పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామి ఇస్తాడని హుజురాబాద్ బీజేపి క్యాడర్ మండిపడుతోంది. కొత్త నాయకులు – పాత నాయకులు, ఆ వర్గం – ఈ వర్గం అంటూ పార్టీని విభజిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాలకి కట్డుబడి ఉండకుండా.. ఇతర పార్టీ టికెట్ ఎలా ఇప్పిస్తానని చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ఉంది బీజేపి పార్టీనేనని.. ఈటల వ్యక్తిగత దుకాణం కాదని చర్చించుకుంటున్నారు. అయితే ఈటల వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్న కరీంనగర్ బీజేపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును కలిసి తమ అవేదనని తెలియజేసారు. హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీలో ఈటల విభేదాలు సృష్టిస్తూ పార్టీని బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా అనుచరులని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అంతర్గత విభేదాలు పార్టీకి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈటెల రాజేందర్ ని కట్టడి చేయాలని రాష్ట్ర అధినాయకత్వాన్ని కరీనంగర్ బీజేపీ నేతలు కోరారు.
