Tariff on Movies: మరిన్ని టారీఫ్‌లు ఉండబోతున్నాయంటూ ముందు నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. అమెరికా వెలుపల నిర్మించిన సినిమాలపై ఏకంగా 100 శాతం టారిఫ్ విధిస్తామంటూ (Tariff on Movies) సోమవారం ప్రకటన చేశారు. ఈ విషయంలో ఏ సినిమాలకూ మినహాయింపు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, అమెరికాలో తయారు చేయకుండా దిగుమతి చేసుకుని ఫర్నీచర్ విక్రయించే అన్ని దేశాలపైనా గణనీయమైన టారిఫ్‌లు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ తెలిపారు. చిన్నపిల్లల చేతిలోంచి క్యాండీని లాగేసుకున్నట్టుగానే, అమెరికా సినిమా రంగ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు.
Read Also- POK Protests: పీవోకేలో కల్లోలం.. సామాన్యులపై ఆర్మీ, ఐఎస్ఐ కాల్పులు.. ఇద్దరు మృతి
కాలిఫోర్నియా ప్రభుత్వంపై మండిపాటు
కాలిఫోర్నియా రాష్ట్ర బలహీనమైన, బుద్ధిలేని గవర్నర్ కారణంగా అమెరికా సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. కాబట్టి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న, ఈ సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా అమెరికా వెలుల నిర్మితమైన ఏ సినిమాపైనైనా 100 శాతం టారీఫ్ విధించనున్నానని పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో స్పందిస్తూ, ‘‘ఉత్తర కరోలినా రాష్ట్రం తన ఫర్నిచర్ వ్యాపారాన్ని పూర్తిగా చైనాకు, ఇతర దేశాలకు కోల్పోయింది. ఆ రాష్ట్రాన్ని తిరిగి గొప్పగా నిలబెట్టేందుకు అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయని ఏ దేశంపైనైనా భారీ టారీఫ్‌లు విధించనున్నాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ టారీఫ్‌లకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంటూ ఆయన తెలిపారు.
Read Also- Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్
భారతీయ సినిమాలపై ప్రభావం
విదేశీ సినిమాలపై అమెరికాలో టారీఫ్‌లు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనేది ప్రస్తుతానికి స్పష్టత రాకపోయినప్పటికీ, అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతున్న భారతీయ సినిమాలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి, పఠాన్ వంటి చిత్రాలు అమెరికా మార్కెట్‌లో మంచి విజయాన్ని అందుకొని, అద్భుతమైన వసూళ్లు రాబట్టాయి. అనేక చిన్న సినిమాలు కూడా అక్కడి మార్కెట్‌ను క్యాష్ చేసుకున్నాయి. కానీ, 100 శాతం టారీఫ్ విధిస్తే మాత్రం సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశముందని సినీ రంగ నిపుణులు చెబుతున్నారు.