Ind Vs Pak Final: ఆసియా కప్-2025 తుది పోరుకు సర్వం సన్నద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే దాయాదులైన భారత్-పాకిస్థాన్ జట్లు (Ind Vs Pak Final) దుబాయ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. దీంతో, టోర్నీలో ఇప్పటివరకు అద్భుతంగా రాణించిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఫైనల్ పోరులో అభిషేక్ రికార్డు సృష్టించగలడా? అన్న ఆసక్తి నెలకొంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ వరుసగా అర్ధ శతకాలు సాధించాడు. దీంతో, టీ20 ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరసన అభిషేక్ చేరారు. ఇక పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధిస్తే, వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా ఘనత అందుకుంటాడు. అయితే, ఒత్తిడితో ఆడే ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ చరిత్ర సృష్టించగలడా?, లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అభిషేక్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసియా కప్-2025లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ టీమిండియాలో ఎవరు మంచిగా ఆడినా మనం మ్యాచ్ గెలుస్తాం. భారత్ గెలవాలని, ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభిషేక్ అత్యుత్తమ ప్రయత్నం చేస్తాడు. అది మా కుటుంబానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తుంది’’ అని రాజ్‌కుమార్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారత అభిమానులు అందరూ అభిషేక్ శర్మ ప్రదర్శనపై ఆశలు పెట్టుకున్నారు. కీలకమైన ఫైనల్‌లో ఎలా ఆడతాడోనని ఎదురుచూస్తున్నారు.
Read Also- OTT Movie: మంచు ఎడారిలో చిక్కుకున్న మహిళ సహాయం కోసం వస్తే.. థ్రిల్లింగ్ అదిరిపోద్ది
టీమిండియా జోరుగా ప్రాక్టీస్
పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం, ఆదివారం ఉదయం కూడా జోరుగా ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్, టీమ్ సీనియర్ సభ్యుల సందేశాలు ఇస్తుండడం వీడియోలో కనిపించింది. కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ గణాంకాల విషయానికి వస్తే, భారత జట్టుకు అంత మంచి రికార్డు లేదు. ఈ రెండు జట్లు మొత్తం 12 సార్లు ఫైనల్స్‌లో తలపడగా భారత్ 4 సార్లు మాత్రమే గెలిచింది. పాకిస్థాన్ ఏకంగా 8 సార్లు విజయం సాధించడం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి భవిష్యత్ ఫలితాలను అంచనా వేయలేం. ఆ రోజు మ్యాచ్‌లో ఎలా రాణించామన్నదే ముఖ్యం అవుతుంది. కాగా, ఆదివారం జరిగే మ్యాచ్‌లో చరిత్ర పునరావృతమవుతుందా?, లేక కొత్త రికార్డు క్రియేట్ అవుతుందో చూడాలి.
Read Also- Future City: ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన.. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సూర్యపై ఒత్తిడి పెంచవద్దు
భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ మాజీ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఒత్తిడి పెంచకూడదని సూచించాడు. సూర్య ధైర్యంగా తన ఆటను ఆడుతూనే ఉండాలని, బయట ఉన్న అంచనాల గురించి పట్టించుకోకూడదని అన్నాడు. ఈ టోర్నీలో సూర్య ప్రదర్శనలో అంత స్థిరత్వం లేకపోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాణించాలని అన్నాడు. ‘‘సూర్యకుమార్ సగటు 25 పరుగులే అయినా స్ట్రైక్ రేట్ 170గా ఉంది. తక్కువ స్ట్రైక్ రేట్‌తో సూర్య కనీసం 40 పరుగులు సాధించినా ఆనందించాల్సిన విషయమే. అతడిని ఒత్తిడికి గురిచేయవద్దు. టీ20 క్రికెట్‌కి సగటు ముఖ్యం కాదు, ప్రభావం ఎంతనేది అవసరం’’ అని ఆశ్విన్ వ్యాఖ్యానించాడు.