Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పొరుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా వరద నీరు చేరుతోంది. రిజర్వాయర్లకు ఎగువ ప్రాంతాలైన శంకర్ పల్లి, వికారాబాద్, చేవేళ్ల ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జలాశయాలకు ఇన్ ఫ్లో ఎప్పటికపుడు పెరుగుతుంది. దీంతో జలమండలి అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రిజర్వాయర్లకు చెందిన 21 గేట్లను ఎత్తి దిగువకు భారీగా 25 వేల 114 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
10వేల క్యూసెక్కుల నీరు విడుదల
వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాలను గుర్తించి ఇరువైపులా పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారీగా వరద నీరు ప్రవహిస్తున్న చోటకు జనం వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఉస్మాన్ సాగర్ కు చెందిన 12 గేట్లను తొమ్మిది అడుగుల మేరకు ఎత్తి 10 వేల 668 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇలాగే హిమాయత్ సాగర్ కు చెందిన తొమ్మిది గేట్లను అయిదు అడుగుల మేరకు ఎత్తి 14 వేల 446 క్యూ సెక్కుల నీటిని దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. చాలా కాలం తర్వాత జంట జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో దిగువకు రికార్డు స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మూసీ పరివాహక ప్రాంతాలపై ఫోకస్
జంట జలాశయాల నుంచి భారీ మోతాదులో నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో రాజేంద్రనగర్, అత్తాపూర్, పురానాపూల్, నయాపూల్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల ప్రజలను పోలీసులు, జలమండలి, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మంది ప్రజలను గోడే కీ ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Metro Fest 2025: దసరా స్పెషల్.. మెట్రోలో ఫ్రీ ఫుడ్ స్టాల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. హైదరాబాదీలకు పండగే!
జలాశయాల నీటి మట్టాలు
ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1789.20 అడుగులు(3.716 టీఎంసీలు)లకు చేరినట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఈ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లోగా 8 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఔట్ ఫ్లోగా 10 వేల 668 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.95 అడుగులు (2780 టీఎంసీలు)గా ఉంది. ఈ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లోగా 8 వేవ క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఔట్ ఫ్లోగా 14 వేల 446 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ వరకు హైదరాబాద్, ఇరుగు పొరుగు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు రానున్నట్లు సమాచారం. ఇన్ ఫ్లో పెరిగిన కొద్దీ ఔట్ ఫ్లోను పెంచేలా జలమండలి అధికారులు ఎప్పటికపుడు జలాశయాల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.