Haris Rauf controversy: ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య గత ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి సూపర్-4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ఏ దశలోనూ సరిగ్గా రాణించలేకపోయి పాక్ క్రికెటర్లు నోటికి పని చెప్పారు. ముఖ్యంగా పాక్ పేసర్ హారిస్ రౌఫ్ పలుమార్లు అనుచితంగా ప్రవర్తించాడు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో గొడవకు దిగాడు. వారిద్దరూ గట్టిగా బుద్ధి చెప్పారు. అది జరగడానికి ముందు హారిస్ రౌఫ్ స్టేడియంలోని భారత అభిమానులను రెచ్చగొట్టే చర్యకు (Haris Rauf controversy) పాల్పడ్డాడు. భారత అభిమానుల వైపు చూస్తూ ‘6-0’ అని సంకేతం ఇచ్చాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలను పాకిస్థాన్ కుప్పకూల్చిందంటూ చేతులతో సైగలు చేశాడు. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న హారిస్ రౌఫ్ వ్యవహారంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘డైలీ టైమ్స్’ అనే పాక్ పత్రిక కాలమినిస్ట్ అయాబ్ అహ్మద్ షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన ఆయన, ‘‘హారిస్ రౌఫ్ వాళ్లకు తగిన బుద్ధి చెబుతున్నాడు. అలాగే కొనసాగించు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. కానీ, 6-0ను భారత్ ‘జడ్జ్‌మెంట్ డే’ వరకు మర్చిపోదు. ప్రపంచం కూడా దీనిని గుర్తుంచుకుంటుంది’’ అంటూ ఉర్దూలో ఆయన రాసుకొచ్చారు. కాగా, పత్రికా కాలమిస్ట్ ఆయాబ్ అహ్మద్ మరొక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. అందులో విమానాలు కూలుతున్నట్లుగా హారిస్ రౌఫ్ తన చేతులతో సంకేతాలు ఇచ్చాడు. హారిస్ రౌఫ్ భారత్‌కు మళ్లీ బుద్ధి చెబుతున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పక్కన పాకిస్థాన్ జెండా, నవ్వుతున్న ఎమోజీ జతచేశారు.
Read Also- IND vs BAN Clash: రేపే మ్యాచ్.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్
పాక్ ఫేక్ వాదన
ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, ఐ వాదనకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. పాక్ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన ప్రకటన తప్ప మరో ఆధారం ఇప్పటివరకు ప్రపంచానికి చూపించలేదు. పాకిస్థాన్ వాదనను భారత వాయుసేన అధిపతి ఏపీ సింగ్ ఇదివరకే ఖండించారు. ‘‘ఆపరేషన్ సింందూర్‌లో అసలు నష్టం పాకిస్థాన్‌కే జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన 6 సైనిక విమానాలు నేలకూలిపోయాయి. అందులో ఐదు ఫైటర్ జెట్లు, ఒక పెద్ద విమానం ఉంది. 300 కిలోమీటర్ల దూరం నుంచి ఆ విమానాన్ని కూల్చివేశాం. భూఉపరితలం నుంచి ఆకాశంలో ఉన్న ఆ పెద్ద విమానాన్ని కూల్చివేశాం’’ అని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ సింగ్ వివరించారు. పాకిస్థాన్‌తో మే నెలలో మొత్తం 100 గంటల సైనిక ఘర్షణ జరిగిందని, దాయాది దేశానికి భారీ నష్టం వాటిల్లిందని ఏపీ సింగ్ వివరించారు. అయితే, పాక్‌కు చెందిన ఏ రకమైన ఫైటర్ జెట్లు కూలిపోయాయన్న వివరాలను వెల్లడించలేదు. మరింత నష్టం జరుగుతుందన్న భయంతోనే పాకిస్తాన్ తక్షణమే కాల్పుల విరమణ కోరిందని ఆయన వెల్లడించారు.
Read Also- UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’