Viral News: వాహనం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్‌పైనే ఏకాగ్రత నిలపాలి. లేదంటే, ఒక్క క్షణంలోనే జీవితాలు తలకిందులయ్యే ప్రమాదాలు జరుగుతాయి. ఈ నిజాన్ని మరిచిన ఓ ట్రక్కు డ్రైవర్ ఏకంగా 3 గంటలపాటు మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. చాలాసేపు సోషల్ మీడియా కంటెంట్ చూసి, ఆ తర్వాత అసభ్యకరమైన చిత్రాలు కూడా ఓపెన్ చేసి చూశాడు. చివరకు, డ్రైవింగ్‌పై ఏకాగ్రతను కోల్పోయి ఘోరప్రమాదానికి కారకుడయ్యాడు. బ్రిటన్‌లో ఈ షాకింగ్ ఘటన (Viral News) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మునిగిపోయిన ట్రక్కు డ్రైవరే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో, నిందిత ట్రక్కు డ్రైవర్‌కు న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
దోషిగా తేలిన ఆ డ్రైవర్ పేరు నీల్ ప్లాట్, అతడి వయసు 43 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. 2024 మే 17న లాంకషైర్‌లోని స్కెల్మర్స్‌డేల్ సమీపంలో ఉన్న ఎం58 హైవేపై ఈ ఘోరప్రమాదం సంభవించింది. ట్రక్కు స్కాట్లాండ్‌లోని డమ్‌ఫ్రీస్ నుంచి ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 46 ఏళ్ల వయసున్న డేనియెల్ ఎట్చిసన్ అనే బ్రిటన్ పౌరుడు వ్యక్తి చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ మరణానికి నీల్ ప్లాట్ కారణమయ్యాడని వివరించారు.
Read Also- Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్
కాగా, పోలీసులు విడుదల చేసిన ఫొటోలలో, ప్రమాదం జరిగిన వెంటనే హెవీ గూడ్స్ వెహికల్‌లో నిందితుడు నీల్ ప్లాట్ తన ముఖానికి చేతులు అడ్డుగా పెట్టుకొని కూర్చున్నట్టు కనిపించింది. మూడు గంటల డ్రైవింగ్ సమయంలో ఎక్స్ (ట్విటర్r), వాట్సప్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్ స్క్రోల్ చేసినట్టు విచారణలో బయటపడింది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అతడు ఎక్స్‌లో అసభ్యకర చిత్రాలు చూడడం కూడా కనిపించిందని న్యాయస్థానానికి పోలీసులు వివరించారు. ఈ మేరకు ట్రక్కులోని డాష్‌క్యామ్‌లో డ్రైవర్ యాక్టివిటీస్ అన్నీ రికార్డయ్యాయి. ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు నీల్ ప్లాట్ తన ఫోన్‌తో పదేపదే చూసినట్టు డాష్‌క్యామ్ ఫుటేజ్‌తో పాటు ఫోన్ డేటా విశ్లేషణలో కూడా స్పష్టంగా నిర్ధారణ అయింది.
కాగా, ప్రమాదంలో చనిపోయిన డేనియెల్ ఎట్చిసన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన హ్యుందాయ్ కోనా కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘోరం జరిగిందన్నారు. ఆ సమయంలో డేనియల్ తన భార్య కెర్రీతో హ్యాండ్స్-ఫ్రీ కాల్ (బ్లూటూత్ హెడ్‌సెట్) మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ట్రక్కు డ్రైవర్ నీల్ ప్లాట్ నడిపిన హెచ్‌జీవీ వెనుక నుంచి డేనియల్ కారును ఢీకొట్టింది. మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో, డేనియల్ ఎట్చిసన్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
Read Also- Minister Raja Narasimha: కిడ్నీ పేషెంట్లకు శుభవార్త.. ప్రతి 25 కిలోమీటర్లకు ఓ డయాలసిస్ సెంటర్!
నిందితుడు నీల్ ప్లాట్ కూడా ఈ ప్రమాదానికి తానే కారణమని అంగీకరించాడు. విచారణలో భాగంగా ప్రెస్టన్ క్రౌన్ కోర్టులో అతడు హాజరయ్యాడు. కేసు తీర్పు వెలువరించిన జడ్జి ఇయాన్ అన్‌స్వర్త్… నీల్ ప్లాట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీ డ్రైవింగ్ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా, ఉద్దేశపూర్వకంగా రోడ్ సేఫ్ట్ రూల్స్ విస్మరించారు. సూటిగా చెప్పాలంటే, ఒక ఘోర ప్రమాదానికి సిద్ధంగా ఉన్న ట్రక్కు మాదిరిగా మారిపోయావు. ప్లాట్ రోడ్డుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సోషల్ మీడియాలో గడిపేందుకు ప్రాధాన్యత ఇచ్చాడు. నువ్వు చేసింది బుద్ధిలేని పని. నీ ముందున్న ట్రాఫిక్‌ను కూడా గమనించలేదు. కానీ ఫోన్‌ను మాత్రం చూస్తూ ఉన్నావ్. అందుకే, 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నాను. మూడింట రెండొంతులు వంతు కాలాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది. అలాగే, ఏడేళ్లపాటు డ్రైవింగ్ నిషేధం కూడా విధిస్తున్నాను’’ అని జడ్జి తీర్పునిచ్చారు.