Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నగర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తల్లి అనారోగ్యానికి గురికావడంతో డ్యూటీలో ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. బుధవారం (సెప్టెంబర్ 17) అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బాధిత డాక్టర్ ఏమన్నారంటే?
డాక్టర్ రాహుల్ బాబు మాట్లాడుతూ.. తనను బలవంతంగా పోలీసులు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తాను తిరస్కరించినప్పటికీ కిడ్నాప్ చేసి మరి ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఫలితంగా జిల్లా ఆస్పత్రిలో అవుట్‌పేషంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవలు రెండు గంటలపాటు నిలిచిపోయాయని తెలియజేశారు. అయితే డాక్టర్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంపై వైద్య సంఘాలు నిరసనలు తెలియజేశారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
సెప్టెంబర్ 17 రాత్రి 11 గంటల సమయంలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు పోలీసులు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చారు. డాక్టర్ బాబును SSP నివాసానికి రమ్మని ఒత్తిడి చేశారు. ఆయన తన విధులు కారణంగా రాలేనని చెప్పడంతో బలవంతంగా లాక్కెళ్లారు. ఎవరికి ఫోన్ చేయనివ్వకుండా తన మెుబైల్ సైతం లాక్కున్నారని బాధిత డాక్టర్ ఆరోపించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి ఓ పబ్లిక్ ప్రదేశంలో వదిలేశారని తెలిపారు. అంతేకాదు బలవంతంగా తీసుకెళ్లే క్రమంలో సివిల్ లైన్స్ SHO సునీల్ కుమార్, కానిస్టేబుల్ హితేష్ వర్మ తమపై దాడి చేశారని ఆరోపించారు. ఫార్మసిస్ట్ పైనా చేయి చేసుకున్నారని చెప్పారు.
Cops kidnapped the doctor in Etawah after the incumbent SSP’s mother suddenly fell ill at night. SP might have ordered to arrange a doctor at night. Thereafter, Etawah police reached the District Hospital and forcibly dragged a doctor & pharmacist from the hospital, threatening… pic.twitter.com/vngk9nRemh
— Krishna Chaudhary (@KrishnaTOI) September 19, 2025
ఉద్యోగ సంఘాల డిమాండ్
డాక్టర్, ఫార్మసిస్టుపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్, డిప్లోమా ఫార్మసిస్ట్ అసోసియేషన్, PMS యూనియన్ లాంటి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘దోషులపై తప్పనిసరిగా FIR నమోదు చేయాలి. లేకుంటే మా నిరసనను మరింత తీవ్రతరం చేస్తాం’ అని ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అర్వింద్ ధంగర్ హెచ్చరించారు.
పోలీసు అధికారి స్పందన
మరోవైపు ఎస్ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తాను కేవలం ప్రైవేట్ డాక్టర్ ను మాత్రమే కోరినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ డాక్టర్‌ను బలవంతంగా తీసుకెళ్లారని తెలియదని అన్నారు. ‘ఇలాంటి చర్యలు తప్పు. అంగీకారయోగ్యం కావు. దీనిపై సిటీ సర్కిల్ ఆఫీసర్ సమగ్ర విచారణ చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.
Also Read: Pakistan Saudi: పాక్‌కు అండగా భారత్‌తో సౌదీఅరేబియా యుద్ధం చేస్తుందా?.. పాక్ మంత్రి క్లారిటీ
ఆసుపత్రి సేవలు పునరుద్ధరణ
ఇదిలా ఉంటే ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి బ్రిజేంద్ర కుమార్ సింగ్ జోక్యం చేసుకుని నిరసన కారులను శాంతింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘DGP, SSPలకు లేఖ పంపించాం. కేసు నమోదు చేయాలని కోరాం. ఎలాంటి రాజీ ఉండదు. చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారు’ అని అన్నారు.