TG Congress: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్(Congress) పక్కా వ్యూహాలు రచిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐ(CBI)కి అప్పగించిన కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసును సైతం ఆ సంస్థకే అప్పగించాలని భావిస్తుండటం ఇందులో భాగమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీబీఐ దర్యాప్తులో కాలయాపన జరిగితే బీజేపీ(BJP).. బీఆర్ఎస్(BRS) ఒక్కటే అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలకు బలం చేకూరుతుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కొన్ని నెలల్లోనే కుంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Justice P.C. Ghosh Commission) తో విచారణ జరిపించింది. ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తోపాటు పదుల సంఖ్యలో ఇంజనీర్ల నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు సేకరించింది.
అసెంబ్లీ సాక్షిగా ప్రకటన..
అనంతరం డిజైన్ లోపాలు, సరైన నాణ్యత పాటించక పోవటం, అప్పటి పాలకులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, నిపుణులైన ఇంజనీర్ల సలహాలు తీసుకోక పోవటం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినట్టు నివేదిక ఇచ్చింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Reanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన కూడా చేశారు. ఇక, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పక్కా వ్యూహం ప్రకారమే కాంగ్రెస్(Congress) ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సిట్ తో విచారణ జరిపిస్తోంది.
Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!
బీజేపీకి చెక్ పెట్టేందుకే..
అయితే, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు మొదలుకుని పలువురు నాయకులు నెలల తరబడిగా ఈ కేసు విచారణను సాగిస్తున్నారంటూ పలుమార్లు విమర్శలు చేశారు. అసలు సూత్రధారులను బయటకు తీసుకు రావటం లేదని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ కలిసే విచారణ పేర డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసును అప్పగిస్తే ఒకటి రెండు నెలల్లోనే అసలు సూత్రధారులు ఎవరన్నది వెలుగులోకి తెస్తామని కూడా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించాయి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ తోపాటు అటు బీజేపీకి చెక్ పెట్టేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ విచారణలో ఆలస్యం జరిగినా…కేసులోని సూత్రధారులు ఎవరన్నది బయట పడక పోయినా దానికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ వాదిస్తుందని అంటున్నారు. నెల..రెండు నెలల్లో సూత్రధారులు ఎవరన్నది తేలుస్తామని ప్రకటనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రులు ఇప్పుడేం చేస్తున్నారంటూ ప్రజా క్షేత్రంలో నిలదీసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ…బీఆర్ఎస్ ఒకటే అని తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాట నిజమే అని ప్రచారం చేస్తుందని అంటున్నారు.
Also Read: Beauty Movie: ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అంటే కుదరదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు