Hydraa: మహానగరంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఇంకా కొన్ని ప్రాంతాలు కోలుకోనే లేదు. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) గురువారం పరిశీలించారు. అమీర్‌పేట(Ameerpet)లోని గాయత్రి కాలనీ, మాధాపూర్(Madhapur)లోని అమర్ సొసైటీ, బాగ్‌లింగంపల్లి లోని శ్రీరాంనగర్‌లలో హైడ్రా కమిషనర్ పర్యటించి, ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అమీర్‌పేట వద్ద కాలువల్లో పూడిక తీయడంతో సాఫీగా వరద సాగుతోందని, ఇదే మాదిరి నగరంలోని అన్ని చోట్ల నీటి ముంపునకు మూలాలను తెలుసుకుని, సమస్య పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పై నుంచి భారీ మొత్తంలో వస్తున్న వరద నీరు మైత్రి వనం వెనుక ఉన్న గాయత్రినగర్‌ను ముంచెత్తుతోందని, ఇక్కడ కూడా కాలువలలో సిల్ట్ తొలగించి వరద ముప్పు సమస్యను తొలగించాలని అక్కడి నివాసితులు కమిషనర్‌ను కోరారు. పై నుంచి నాలాల్లో పూడిక తొలగిస్తూ వస్తున్నామని, ఇక్కడ కూడా పరిష్కార చర్యలు చేపడుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.
దుర్గం చెరువులో నీటిమట్టం తగ్గించాలి
దుర్గం చెరువులో నీటి మట్టం పెరగడంతో పై భాగంలో ఉన్న అమర్ సొసైటీతో పాటు అనేక కాలనీలుకు వరదనీరు పోటెత్తుతోందని స్థానికులు కమిషనర్ కి తెలిపారు. చెరువు నీటి మట్టం తగ్గిస్తే కొంత వరకు సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. ఈ విషయమై ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. క్లౌడ్ బరస్ట్ తో అనూహ్యంగా గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ పరిస్థితులను తట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ సూచించారు.
Also Read: Viral News: ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్.. భర్త చెవులు కోసేసిన భార్య
శ్రీరాంనగర్ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం
బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్లో వరద నీరు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సజావుగా ప్రవహించేందుకు వీలుగా తక్షణమే చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఇందుకు గాను శ్రీరాంనగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వదర కాలువలో కలిసేలా ప్రత్యేక నాలాను నిర్మించాలని సూచించారు. నేరుగా హుస్సేన్ సాగర్(Husen sagar) వరద కాలువలో కలపకుండా, కొంతదూరం కొనసాగించి నాలాను కలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఉన్న నాలాను బంద్ చేసి, అక్కడ ప్రభుత్వ స్థలాన్ని కొంత మంది కబ్జా చేస్తున్నారని, ఆ నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు కమిషనర్‌కు తెలిపారు.
శ్రీరాంనగర్‌లో వందలాది గృహాలకు దారి లేకుండా పోయిందని, నడుం లోతు నీటిలో ఇళ్లకు ఎలా వెళ్లేదని స్థానికులు కమిషనర్ ముందు వాపోయారు. మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నా, సమస్య పరిష్కారం కావడంలేదని, ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలో నుంచి నాలాను ఏర్పాటు చేసి, హుస్సేన్‌సాగర్ వరద కాలువలో కలపాలని కోరటంతో, విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు.
Also Read: CM Revanth Reddy: విద్యారంగం సమూల ప్రక్షాళనే మా ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
