TGPSC Controversy: గ్రూప్ 1 పోస్టుకు రూ.3 కోట్లు ఇచ్చారంటూ రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ స్పందించారు. తొలిసారిగా వారు మీడియా ముందుకు వచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కాగా పలువురు పేరెంట్స్ మాట్లాడుతూ.. వారి ఆవేదనను వెళ్లగక్కారు. గ్రూప్ 1 ఫలితాలపై ఒక్కొకరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపిస్తున్నారని వారు పేర్కొన్నారు. వాస్తవానికి తమలో కొందరికి కూటికి కూడా గతి లేదని పేరెంట్స్ వాపోయారు. కష్టపడి, పస్తులుండి, అప్పులు చేసి పిల్లలను చదివించామని వివరించారు.
వాస్తవాలను బయటపెట్టాలి
సమాజం తమపై చిన్నచూపు చూసే అవకాశం ఉందని, ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే తాము తప్పు చేసిన వాళ్లమవుతామనే ఉద్దేశ్యంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్ లో తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రూ.3 కోట్లు పెట్టి కొనుక్కున్నారని నలుగురూ అనుకునే అవకాశం ఉందని వాపోయారు. రాజకీయాలు తమ మధ్యే ఉంచుకోవాలని, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలను నిరుద్యోగులపై రుద్దకూడదని వారు డిమాండ్ చేశారు. అనవసరంగా దుష్ప్రచారం చేసి నిరుద్యోగులను చిన్నచూపు చూసే ఆరోపణలు చేయొద్దని సూచించారు. రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని, వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయాలు చేసి తమ పిల్లల జీవితాలు నాశనం చేయొద్దని కోరారు. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమకు తెలియదని పేరెంట్స్ వాపోయారు. రూ.3 కోట్లు ఉంటే.. ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాం కదా అంటూ వెల్లడించారు.
Also Read; Duvvada Srinivas: నేను, మాధురి అందుకే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళలేదు.. దువ్వాడ శ్రీనివాస్
పిల్లల భవిష్యత్ కోసమే పట్నం
ఎనికల్లో పోటీ చేస్తే కూడా ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారని, అలా అని ఓడిపోయిన నేతలంతా మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. అప్పు చేసి రూ.వేలకు వేలు ఫీజులు కట్టి.. కోచింగ్ సెంటర్ల లో తమ పిల్లను చేర్పించామని పేరెంట్స్ వెల్లడించారు. మారుమూల గ్రామాల నుంచి కేవలం పిల్లల భవిష్యత్ కోసమే పట్నం వచ్చామని వారు వెల్లడించారు. తమ మాదిరిగా పిల్లల భవిష్యత్ అవ్వకూడదని పస్తులుండి చదివిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసం.. అవాస్తవ ఆరోపణలు చేస్తే ఎలా? అంటూ గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రశ్నించారు. నోటి వరకు వచ్చిన కూడు లాక్కోవద్దని వారు కోరారు. మళ్లీ పరీక్షలు పెట్టినా సజావుగా నిర్వహిస్తారని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో పుట్టరని, నిరుద్యోగులు, యువకులకు ఇలాంటి అన్యాయాలు చేయడం వల్లే తీవ్రవాదులుగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ప్రభుత్వం, కోర్టులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదిలా ఉండగా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ జవాబు చెబుతామని గ్రూప్ 1 ర్యాంకర్లు హెచ్చరించారు.
Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!