Viral Video: ఉత్తర్ ప్రదేశ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తను.. కోర్టు ఆవరణలోనే ఓ భార్య చితక్కొట్టింది. ఈ సంచలన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భర్తపై దాడి చేయడంతో పాటు అతడిపైనే భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య కొడుతున్న వీడియో తాజాగా బయటకు రావడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్ ఖజురియా ప్రాంతంలోని బంబురా గ్రామానికి చెందిన ఆసియా.. 2018లో ధీమ్రి గ్రామానికి చెందిన ఆషిద్ అలీని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వివాహం తర్వాత భర్త, అత్తింటివారు తరచుగా తనను కొడుతున్నారని ఆసియా ఆరోపించింది. ఈ వేధింపులు భరించలేక, ఆమె తన పిల్లలతో కలిసి తల్లి ఇంట్లో నివసించడం మెుదలుపెట్టింది.
భార్య ఏమన్నారంటే
అయితే ఐదు నెలల క్రితం ఆసియా.. ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) కేసు విచారణ కోసం ఆసియా తన అమ్మ రేష్మాతో కలిసి కోర్టుకు వచ్చింది. భర్త ఆషిద్ అలీ, మామ కూడా విచారణకు హాజరయ్యారు. కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఇరువురూ బయటకు వచ్చిన సమయంలో భర్త, మామ తనను తిట్టారని ఆసియా ఆరోపించింది. అంతటితో ఆగకుండా భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆసియా కోర్టు ఆవరణలోనే భర్తపై చెప్పుతో దాడి చేసింది. అనంతరం నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి భర్త, మామలపై ఫిర్యాదు చేసింది.
Kalesh between Husband-Wife outside the court, a wife beats her husband with slippers, five strikes in five second: chased him, grabbed him by the collar, and tore his clothes after he gave her triple talaq, Rampur UP. pic.twitter.com/Bt6RY2Usa1
— Ashish Kumar (@BaapofOption) September 14, 2025
Also Read: Viral Video: టూరిస్ట్‌గా వచ్చి.. లోకల్ బాలికలతో పిచ్చివేషాలు.. చితక్కొట్టిన స్థానికులు
ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి?
ట్రిపుల్ తలాక్ అంటే ముస్లిం సమాజంలో ఒక వివాహ విచ్ఛిన్న పద్ధతి. దీని ప్రకారం భర్త తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు ఇస్తాడు. దీనిని తలాక్-ఎ-బిద్దత్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ మతపరమైన ఆచారానికి చెక్ పెడుతూ.. 2019లో భారత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహ హక్కుల చట్టం (The Muslim Women (Protection of Rights on Marriage) Act, 2019) తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఈ చట్టం ముస్లిం మహిళల హక్కులను రక్షించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి రూపొందించినట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టం 2017లో సుప్రీం కోర్టు తీర్పు (ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన) ఆధారంగా రూపొందింది.