GHMC: జీహెచ్ఎంసీ సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బల్దియా అధికారులు, ఉద్యోగులకు కార్పొరేషన్ తరపున ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల సమగ్ర జాబితాను జీహెచ్ఎంసీ(GHMC) డిజిటలైజ్ చేయనుంది. ఇందుకోసం టీజీ ఆన్ లైన్ సహకారంతో అసెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను కొత్తగా రూపకల్పన చేసి జీహెచ్ఎంసీ ఆవిష్కరించింది. ఈ విధానంలో వస్తువుల పర్యవేక్షణ, నిర్వహణ మెరుగుపడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మ్యాన్యువల్ వివరాలు నమోదు చేసి, కంప్యూటరీకరణ చేస్తుండగా, ఇక నుంచి వస్తువులకు సంబంధించి ఇండెంట్ నుంచి ఆమోదం, జారీ వరకు అంతా వెబ్ సెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్దమైంది.
వస్తువుల దుర్వినియోగం
సాధారణంగా సంస్థలో అన్ని సెక్షన్లకు అవసరాన్ని బట్టి కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్(CPU), మానిటర్, కేబుళ్లు, మౌస్లు, ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు వంటివి ఐటీ విభాగం సమకూరుస్తారు. హోదాను బట్టి కొందరు అధికారులకు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లు, ట్యాబ్ లు ఇస్తారు. పలువురు అధికారులు, కొన్ని విభాగాలు ఆయా వస్తువులు తరచూ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అంతకు ముందు ఎప్పుడు వస్తువులు ఇచ్చామన్న వివరాలు పూర్తిస్థాయి సమాచారం ఐటీ విభాగం వద్ద లేకపోవడం వల్లే కొంత మేరకు వస్తువుల దుర్వినియోగం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం.
Also Read: CP Radhakrishnan: కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సులభంగా తెల్సుకునేలా ట్రాకింగ్
వస్తువుల దుర్వినియోగానికి చెక్ పెట్టేలా డిజిటలైజేషన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫలితంగా అసెట్ మేనేజ్ మెంట్ తో పారదర్శకత, జవాబుదారీతనం పెరగుతుందని జీహెచ్ఎంసీ(GHMC) భావిస్తుంది. ఉద్యోగులకు కేటాయించిన వస్తువు ఎవరి వద్ద ఉందో సులభంగా తెల్సుకునేలా ట్రాకింగ్ చేయాలని నిర్ణయించారు. వస్తువుల ఒకరి నుంచి మరొకిరికి బదిలీ చేయటం, తిరిగి తీసుకోవడం ఇకపై సులభతరం కానున్నట్లు సమాచారం. అలాగే కొత్తగా జీహెచ్ఎంసీ(GHMC)కి వచ్చే ఉద్యోగులకు, అధికారులకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల సత్వర జారీకి వీలు కలుగుతుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఈ కొత్త వ్యవస్థను తీసుకురావటం పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!