Women vs Jackel: సాధారణంగా 65 ఏళ్లు వచ్చాయంటే చాలా మంది బలహీనంగా మారిపోతారు. కొందరైతే సరిగ్గా నడవడానికే ఇబ్బందిపడుతుంటారు. వ్యక్తిగత పనుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడుతుంటారు. కానీ ఓ 65 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా గుంట నక్కతో పోరాడింది. తనపై దాడికి వచ్చిన క్రూర మృగాన్ని 30 నిమిషాలపాటు నిలువరించి.. చీర కొంగుతో దానిని చంపివేసింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బర్కాడి గ్రామంలో సోమవారం (సెప్టెంబర్ 7) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 65 ఏళ్ల సూరజియా బాయి సోమవారం సాయంత్రం పొలంలో పశువుల కోసం మేత కోస్తుండగా నక్క (Jackal) దాడి చేసింది. దాదాపు 20 నిమిషాల పాటు పోరాడిన ఆమె.. తన చీర కొంగు అంచును తాడులా మార్చుకొని చంపేసింది.
ఆస్పత్రికి తరలింపు..
అయితే నక్కతో పోరాటంలో సూరజియాకు సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. నక్కను చంపిన అనంతరం ఆమె కూడా స్పృహ తప్పి పడిపోయింది. పొలంలో ఆమెను గమనించిన గ్రామస్థులు.. హుటా హుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం.. ఆమె మర్నాడు స్పృహలోకి వచ్చారు. అనంతరం నక్కకు తనకు జరిగిన పోరాటం గురించి ఆమె గ్రామస్థులకు తెలియజేశారు.
Also Read: Bengaluru: తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో బయటపడ్డ.. 20 మంది స్కూల్ విద్యార్థులు
‘చనిపోతానని అనుకున్నా’
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. చిన్న కౌలు రైతు అయిన సూరజియా.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేత కోయడానికి పొలానికి వెళ్లారు. గడ్డికోయడానికి వంగినప్పుడు అక్కడే నక్కి ఉన్న నక్క ఆమె దాడి చేసింది. కాళ్లను, చేతులను కొరుకుతూ గాయపరిచింది. ‘అప్పుడే నేను చచ్చిపోతానని అనుకున్నాను. కానీ నా శక్తిమేరకు నక్కతో పోరాడాను. నక్క నోటిని రెండు చేతులతో పట్టుకునేందుకు యత్నించా. రక్తస్రావంతో బలహీనపడినప్పటికీ మరింత శక్తి తెచ్చుకొని చీర కొంగును చింపాను. దానిని తాడులాగా చేసుకొని నక్క మెడకు బిగించాను. చివరకు నక్క చనిపోయింది’ అని బాధితురాలు వివరించారు.
Also Read: Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!
కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
పొలానికి వెళ్లిన సూరజియా ఎంతకు తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించామని బాధితురాలు కుటుంబం తెలిపింది. పొలంలో స్పృహ లేని స్థితిలో ఆమె పడి ఉండటాన్ని చూసి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. అక్కడ నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి తర్వాత సూరజియాకు స్పృహ రావడంతో తాము ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. మరోవైపు సూరజియా శరీరంపై 18 గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల, మెడ, కడుపు భాగాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రాణపాయం తప్పిందని అన్నారు.