Japan Centenarians: జపాన్ లో వృద్ధ జనాభా నానాటికి పెరిగిపోతోంది. తాజాగా 100 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్యలో జపాన్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. జపాన్ లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన జనాభా లక్షకు చేరువైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. అయితే ఏ దేశంలోనూ ఆ స్థాయిలో 100 ఏళ్లకు పైబడిన వృద్ధులు లేకపోవడం విశేషం.
వృద్దుల్లో 88% మహిళలే..
జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. సెప్టెంబర్ 1 నాటికి ఆ దేశంలో 99,763 మంది శతాధికులు (centenarians) ఉన్నారు. ఇది గత సంవత్సరం కంటే 4,644 మంది ఎక్కువ. వారిలో 88 శాతం మంది మహిళలే ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం జపాన్‌లో అతి పెద్ద వయస్కురాలిగా నారా ప్రాంతానికి చెందిన 114 ఏళ్ల షిగెకో కాగావా (Shigeko Kagawa) ఉన్నారు. కియోటో సమీపంలో నివసించే ఆమె 80 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ప్రసూతి, స్త్రీరోగ వైద్యురాలిగా సేవలందించారు.
కాగావా హెల్త్ సీక్రెట్ ఇదే
అయితే తనకు 116 ఏళ్లు వచ్చినప్పటికీ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు షిగెకో కాగావా తెలిపారు. ‘ఇళ్లకు వెళ్లి రోగులను చూసే సమయంలో ఎక్కువగా నడిచేదాణ్ని. దాంతో నా కాళ్లు బలపడ్డాయి. అదే నా ప్రస్తుత ఆరోగ్య రహస్యం’ అని కాగావా వ్యాఖ్యానించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం ఆమె చూపు కూడా బాగానే ఉందని పేర్కొంది. అందువల్ల ఆమె ఎక్కువ సమయం టీవీ చూడడంలో, పత్రికలు చదవడంలో, కాలిగ్రఫీ చేయడంలో గడుపుతున్నారని వివరించింది.
బ్రిటన్ వృద్దురాలు వరల్డ్ రికార్డ్
ఇదిలా ఉంటే ప్రపంచంలో అతి పెద్ద వయస్కురాలు బ్రిటన్‌కు చెందిన ఎతెల్ కేటర్హామ్ (Ethel Caterham) రికార్డ్ సృష్టించారు. ఆమె ఈ ఏడాది ఆగస్టులో తన 116 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బ్రెజిల్ సన్యాసిని ఇనా కానబార్రో లూకాస్ మరణంతో.. కేటర్హామ్‌కి ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా బిరుదు దక్కింది. ఆమె తర్వాత అత్యధిక వయసు కలిగిన రెండో వ్యక్తిగా జపాన్ కు చెందిన షిగెకో కాగావా ఉన్నట్లు తెలుస్తోంది.
వృద్ధుల వల్ల ఆర్థిక భారం
ఇదిలా ఉంటే ప్రస్తుతం జపాన్.. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వృద్ధుల సంఖ్య నానాటికి పెరిగిపోవడం ఆ దేశంపై ఆర్థిక భారాన్ని పెంచుతోంది. వయసు పైబడి జనాభాకు వైద్యం, సంక్షేమ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలిచే శ్రామిక శక్తి జపాన్ లో నానాటికి తగ్గిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2024లో జపాన్ పౌరుల జనాభా రికార్డు స్థాయిలో తగ్గింది. ఒక్క సంవత్సరంలోనే 9 లక్షల మందికి పైగా తగ్గిపోవడం ఆందోళన కలిగించింది.
Also Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్
ఫలించని ప్రభుత్వ చర్యలు
దేశంలో నెలకొన్న జనాభా సంక్షోభాన్ని ప్రధాని షిగేరు ఇషిబా (Shigeru Ishiba) ‘నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి’ (Quiet Emergency)గా అభివర్ణించారు. జననాల రేటు పెంచేందుకు జనాభా తగ్గుదలను ఆపేందుకు సౌకర్యవంతమైన పని గంటలు, ఉచిత డే కేర్ వంటి కుటుంబ అనుకూల చర్యలకు వాగ్దానం చేశారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ ఫలితాలు రాలేదని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.