Bengaluru: బెంగళూరులో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న క్రమంలో రహదారి పక్కనున్న లోతైన గుంతలో బస్సు కూరుకుపోయింది. ఓ దశలో బస్సు పక్కకి వాలి పడిపోతుందా అన్న భయాలు వ్యక్తమయ్యాయి. గుంతలో పడి బస్సు ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన తోటి వాహనాదారులు బస్సులో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ఓవర్ టేక్ చేసే క్రమంలో..
బెంగళూరులోని బలగేరె మెయిన్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనకాలే వెళ్తున్న ఓ కారు డ్యాష్ బోర్డు కెమెరా ఈ ప్రమాదాన్ని చిత్రీకరించింది. వీడియోను గమనిస్తే.. బస్సు డ్రైవర్ మరో పాఠశాల బస్సును ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు రహదారి అంచు వైపు వెళ్లడంతో ముందు టైర్ గుంతలోకి జారుకుంది. దీంతో బస్సు ఒక్క వైపుకి వంగిపోయి బోల్తా పడే స్థితికి వెళ్లిపోంది.
#Bengaluru A school bus carrying around 20 kids almost toppled on the crater-filled, slushy Panathur–Balagere road. Children had to be rescued through the back door. Ironically, CM & DyCM had visited and inspected this very stretch just a few months ago. pic.twitter.com/lL8tUpI1lg
— Hamsaveni.N (@Hamsaa04) September 12, 2025
ఫ్లకార్డుల ప్రదర్శన
బస్సు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పరిగెత్తుకు వచ్చి విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరిచి పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ‘Refund Tax, We Will Build Our City’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.
స్థానికులు తీవ్ర ఆగ్రహం
“మేమే అత్యధిక పన్ను చెల్లిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఫ్లాట్ ధర దాదాపు రూ.2 కోట్లు. కానీ మాకు రావలసిన మౌలిక వసతులు రావడం లేదు. అందుకే పన్ను తిరిగి ఇవ్వాలి. మేమే మా నగరాన్ని నిర్మించుకుంటాం’ అని ఒక స్థానిక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరు మాట్లాడుతూ ‘ఈ రోడ్డు పరిస్థితి ఎప్పటి నుంచో ఇలాగే ఉంది. పునః నిర్మాణ పనులు ఎప్పుడూ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది’ అని అన్నారు. మరొకరు స్పందిస్తూ ‘గత వారం రోడ్డు మూసేశారు. కేవలం ఒక చిన్న ప్యాచ్ మాత్రమే వేసి వాహనాలను అనుమతించారు’ అని ఆరోపించారు.
Also Read: CM Revanth Reddy: సీఎంగా తొలి గోదావరి పుష్కరాలు.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
మంగళూరులో మరో విషాదం
మరోవైపు కర్ణాటకలోని మంగళూరు సమీపంలో మరో విషాదం చోటుచేసుకుంది. కులూరు జాతీయ రహదారిపై ఉన్న గుంతలో పడి ఓ మహిళ రోడ్డుపై పడిపోయింది. అయితే అదే సమయంలో వెనకగా వచ్చిన లారీ ఆమె మీద నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉడుపి ప్రాంతానికి చెందిన మాధవిగా గుర్తించారు. మంగళవారం ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు బంధువులు తెలిపారు. ఆ గుంత కారణంగా మాధవితో కలిపి మెుత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.