Hyderabad Crime: సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీటిలో ఓ బృందం జార్ఖండ్ వెళ్లింది. కూకట్ పల్లిలోని స్పాన్ లేక్ అపార్ట్ మెంట్ వాస్తవ్యులైన రేణు అగర్వాల్, రాకేశ్ అగర్వాల్ భార్యాభర్తలు. వీరి కూతురు తమన్నా చదువు కోసం వేరే రాష్ట్రంలో ఉంటోంది. భార్యాభర్తలు తమ కుమారుడు శుభం అగర్వాల్ తో కలిసి ఇక్కడ నివాసముంటున్నారు. కాగా, రాకేశ్ అగర్వాల్ ఫతేనగర్ లో స్టీల్ షాపు నడిపిస్తున్నాడు. వ్యాపారంలో శుభం తండ్రికి చేదోడుగా పని చేస్తున్నాడు.
Also Read: Pawan Kalyan OG: ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
బంధువుల ఇంట్లో…
రాకేశ్ అగర్వాల్ కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే వారి బంధువులు కూడా ఉంటున్నారు. వీరింట్లో జార్ఖండ్ కు చెందిన రోషన్ అనే యువకుడు చాలాకాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి రాకేశ్ అగర్వాల్ కుటుంబం స్థితిగతులపై పూర్తి అవగాహన ఉంది. వ్యాపారంలో వచ్చిన డబ్బును భారీ మొత్తాల్లో రాకేశ్ అగర్వాల్ ఇంటికి తెచ్చి దాచి పెట్టే విషయాన్ని గమనించిన రోషన్ ఎలాగైనా సరే నగదుతోపాటు బంగారు ఆభరణాలను దోచుకోవాలని పథకం రూపొందించుకున్నాడు. దీని ప్రకారం తన స్నేహితుడైన హర్షను పదకొండు రోజుల క్రితం జార్ఖండ్ నుంచి పిలిపించి రాకేశ్ అగర్వాల్ ఇంట్లో వంటవానిగా ఉద్యోగంలో పెట్టించాడు.
ఎప్పటిలానే…
ప్రతీరోజులానే ఉదయం రాకేశ్ అగర్వాల్ తన కుమారుడైన శుభం అగర్వాల్ తో కలిసి స్టీల్ దుకాణానికి వెళ్లిపోగా ఇంట్లో రేణు అగర్వాల్ ఒంటరిగా మిగిలింది. సాయంత్రం 5గంటల సమయంలో రాకేశ్ అగర్వాల్, శుభం అగర్వాల్ పలుమార్లు ఫోన్లు చేసినా రేణు అగర్వాల్ నుంచి సమాధానం రాలేదు. దాంతో రాత్రి 7గంటలకు తండ్రీకొడుకులు ఇంటికి వచ్చారు. తలుపు తట్టినా సమాధానం లేకపోవటంతో ప్లంబర్ ను పిలిపించి వెనక వైపు నుంచి ఇంటి లోపలికి పంపించి తలుపులు తెరిపించారు. చూడగా హాల్ లో రేణు అగర్వాల్ దారుణహత్యకు గురై కనిపించింది. ఆమె కాళ్లూచేతులు కట్టేసి ఉండటం అగుపించింది. దాంతో వెంటనే రాకేశ్ అగర్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read: Crime News: డ్రగ్స్ దందాలో హవాలా వ్యాపారులు.. చిట్టా విప్పిన ఈగల్ టీమ్!
వేలిముద్రల ఆధారంగా…
విషయం తెలియగానే కూకట్ పల్లి పోలీసులు క్లూస్ టీం సిబ్బందితో కలిసి నేరస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సేకరించిన వాటితో రోషన్, హర్షల వేలిముద్రలు సరిపోలటంతో ఈ ఘాతుకానికి ఆ ఇద్దరే ఒడిగట్టినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
చిత్రహింసలు…
హత్య చేయటానికి ముందు రోషన్, హర్షలు రేణు అగర్వాల్ ను చిత్రహింసలకు గురి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. నగదు, నగలు ఇంట్లో డిజిటల్ లాక్ ఉన్న బీరువాలో రాకేశ్ అగర్వాల్ దంపతులు భద్రపరిచారు. ఆ లాక్ ఓపెన్ చేయటానికి కావాల్సిన నెంబర్ చెప్పమని రోషన్, హర్షలు రైస్ కుక్కర్ తో రేణు అగర్వాల్ తలపై పలుమార్లు బలంగా మోదినట్టు విచారణలో తేలింది. ఆ తరువాత కత్తితో గొంతు కోసం ఆమెను హత్య చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. హత్య తరువాత రేణు అగర్వాల్ ఒంటిపై ఉన్న నగలు, కొంత నగదును దోచుకున్న రోషన్, హర్షలు ఆ సొత్తను సూట్ కేస్ లో సర్ధుకున్నట్టుగా తేలింది. అనంతరం రక్తం మరకలతో ఉన్న దుస్తులను అక్కడే వదిలేసి స్నానాలు చేసి సూట్ కేస్ తో పరారైనట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ ఇద్దరు సూట్ కేస్ తో బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బయటకు వచ్చిన తరువాత రాకేశ్ అగర్వాల్ కు చెందిన స్కూటీ పైనే ఇద్దరు పారిపోయినట్టుగా కూడా సీసీ కెమెరాల ద్వారా నిర్ధారణ అయ్యింది.
అయిదు బృందాలు…
ఇటీవల జరిగిన సహస్ర హత్య కేసును మరిచిపోక ముందే జరిగిన రేణు అగర్వాల్ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, ఇతర పోలీసు అధికారులు నేరస్థలానికి వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రోషన్, హర్షలు స్కూటీపై కూకట్ పల్లి వై జంక్షన్ వైపు పారిపోయినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో నిందితులు వారి సొంత రాష్ట్రానికి పారిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. లాడ్జీల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఓ ప్రత్యేక బృందం ఇప్పటికే రోషన్, హర్షల స్వస్థలానికి బయల్దేరి వెళ్లిపోయినట్టుగా తెలిసింది. పోలీసు అధికారులతో మాట్లాడగా కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు దొరికాయని చెబుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అంటున్నారు.
Also Read: Crime News: పనిచేస్తున్న సంస్థకే టోకరా.. కోటిన్నర విలువ చేసే నగలతో పరార్.. ఎక్కడంటే..?