Charlapalli Drug Case( image Credit: free pic or twitter)
హైదరాబాద్

Charlapalli Drug Case: చర్లపల్లి డ్రగ్​ కేసులో.. అండర్​ వరల్డ్​ లింకులు.. సంచలన నిజాలు వెలుగులోకి?

Charlapalli Drug Case: అధికార వర్గాల్లో సంచలనం సృష్ఠిం0చిన చర్లపల్లి డ్రగ్ కేసు (Charlapalli Drug Case) నిందితులకు ముంబయి అండర్​ వరల్డ్ తో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నార్కొటిక్ టెర్రరిజంలో భాగంగానే ఈ గ్యాంగ్ మాదక ద్రవ్యాల దందా చేస్తూ వస్తున్నట్టుగా సమాచారం. మీరా భయందర్​ వసాయ్ విరార్​ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కోణంలో విచారణను ముమ్మరం చేసినట్టుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్న శ్రీను విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పట్వారితోపాటు మరికొందరు నిందితులను పోలీస్​ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్​ కూడా దాఖలు చేసినట్టు సమాచారం.

 Also Read: Warangal District: వేధింపులతో.. మహిళా వీఆర్ఎ ఆత్మహత్యా యత్నం..ఎక్కడంటే..?

మీరా భయందర్​ వసాయ్​ విరార్​ పోలీసు(Police)లు గతనెల 8న బంగ్లాదేశ్ (Bangladesh)​ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ ను 105 గ్రాముల మెఫెడ్రోన్​ తో కాశిమీరా బస్టాప్ వద్ద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను జరిపిన విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా మరో 9మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించినపుడు చర్లపల్లి (Charlapalli) నవోదయ కాలనీలో శ్రీను విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పట్వరిలు నడుపుతున్న మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ గురించి తెలిసింది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలో కూలీగా చేరి పూర్తి వివరాలు సేకరించాడు. అతను అందించిన సమాచారంతో దాడి జరిపిన ప్రత్యేక బృందం పెద్ద మొత్తంలో మెఫెడ్రోన్ డ్రగ్ తోపాటు దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

అండర్​ వరల్డ్ తో లింకులు…

కాగా, ఈ డ్రగ్​ రాకెట్ లో ఉన్న నిందితులు కొందరికి ముంబయి అండర్​ వరల్డ్​ తో సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని వెల్లడించిన మీరా భయందర్ వసాయి విరార్​ కమిషనర్​ నికేత్ కౌషిక్ ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. నార్కొటిక్​ టెర్రరిజం కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కాగా, ఒక్క మహారాష్ట్రనే కాకుండా ఈ గ్యాంగ్ దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు డ్రగ్ సప్లయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల దందాలో ఉన్న లోకల్ పెడ్లర్లను నెట్​ వర్క్​ లో చేర్చుకుని ఈ దందా కొనసాగిస్తూ వచ్చినట్టు సమాచారం.

ముస్తఫా ఖాన్ కీలక పాత్ర…

ఈ కేసులో అరెస్టయిన ముంబయికి చెందిన ముస్తఫా ఖాన్​ మెఫిడ్రోన్​ స్మగ్లింగ్​ లో కీలక పాత్ర వహించినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ముస్తఫా ఖాన్​ పై మహారాష్ట్రలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇక, ఇదే కేసులో పట్టుబడ్డ ఫైజల్​ డ్రగ్ విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తేలింది.

అయిదేళ్లుగా…

కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న శ్రీను విజయ్ వోలేటి 2020 నుంచి చర్లపల్లి నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, దీనికి అయిదేళ్ల ముందే నాచారం పారిశ్రామిక వాడలో వాగ్దేవి ఇన్నోసైన్స్ పేర మరో ఫ్యాక్టరీని కూడా శ్రీను విజయ్ వోలేటి ప్రారంభించాడు. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నుంచి ముడి సరుకులను తెప్పించుకుంటూ మెఫెడ్రోన్ తయారు చేస్తూ వస్తున్నాడు. దీనికి తానాజీ పండరీనాథ్ పట్వారి సహకరిస్తున్నాడు. అయిదు నుంచి పది కిలోల వరకు మెఫెడ్రోన్​ ను తయారు చేసి దానిని విక్రయించే వాడని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఒకేసారి పెద్ద మొత్తంలో తయారు చేసి పెడితే పట్టుబడతామన్న ఉద్దేశ్యంతోనే శ్రీను విజయ్ వోలేటి అయిదు…పది కిలోల డ్రగ్ ఉత్పత్తి చేస్తూ విక్రయాలు చేస్తూ వచ్చినట్టు సమాచారం.

 Also Read: Thummala Nageswara Rao: యూరియా పంపిణీలో ఇబ్బందులు రావొద్దు.. మంత్రి తుమ్మల ఆదేశాలు

చర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశం

చర్లపల్లి డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై విచారణ జరిపి 24 గంటల్లో సమగ్ర నివేదికను అంద చేయాలని ఎక్సయిజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎక్సయిజ్​ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. డ్రగ్​ సరఫరా చేస్తున్న నెట్ వర్క్​ మూలాలు హైదరాబాద్ లో వెలుగు చూసిన నేపథ్యంలో కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ తయారవుతున్న డ్రగ్, ముడి సరుకులను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకోవటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మన ఎక్సయిజ్​ శాఖ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వినియోగం, రవాణాపై పటిష్ట నిఘా పెట్టాలన్నారు. దీని కోసం ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ల్యాబ్​ ను సందర్శించిన అధికారులు

మంత్రి ఆదేశాలతో ఎక్సయిజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథం, ఇతర అధికారులు చర్లపల్లి నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్​ ను సందర్శించారు. నేడు మంత్రికి నివేదికను ఇవ్వనున్నారు. సమీక్షా సమావేశంలో ఎక్సయిజ్​ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్​ హరికిరణ్​ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Bigg Boss Telugu 9: జానీ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా? హౌస్ లోకి వెళ్తే మోత మోగినట్టేనా?

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్