Ganesh Visarjan 2025: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలకు ఏటేటా ఆదరణ పెరుగుతుంది. ఇందుకు నిదర్శనమే గతంలో ఒక రోజు జరిగే నిమజ్జనం గడిచిన నాలుగేళ్ల నుంచి రెండు రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఏటా మండపాల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సారి కూడా నిమజ్జనం శని, ఆదివారాలు రెండు రోజులు కొనసాగింది. ఫైనల్ నిమజ్జనం శనివారం ఉదయం ప్రారంభం కాగా, ఆదివారం రాత్రి ముగిసింది. శనివారం అర్థరాత్రి, ఆదివారం ఉదయం కూడా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పై వినాయక మండపాలు నిమజ్జనం కోసం క్యూ కట్టాయి. పాతబస్తీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి గణేష్ మండపాలు నిమజ్జనానికి ఆలస్యంగా కదులుతున్నాయని గుర్తించిన పోలీసులు ముందస్తుగా పుషింగ్ టీమ్ లను ఏర్పాటు చేసి, మండప నిర్వాహకులను చైతన్యవంతులను చేశాయి.
నిమజ్జన ప్రక్రియను మరింత వేగవం
ఆదివారం కూడా నిమజ్జనం కొనసాగిన, సెలవు రోజు కావటంతో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులకు ఈ సారి కాస్త ఇబ్బందులు తగ్గాయి. ఆదివారం తెల్లవారుఝము అయిదు గంటల నుంచి జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు అప్పర్ ట్యాంగ్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లలో విగ్రహాల నిమజ్జన ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. మరో వైపు సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 40 క్రేన్ల వద్ద, రోడ్డుపై పేరకుపోయిన నిమజ్జనం చెత్తను తొలగించటం ప్రారంభించారు. ఉదయం పది గంటల నుంచి సాగర్ చుట్టూ ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ కావటంతో అందుకు కారణమైన గణేశ్ మండపాలను పోలీసులు ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఐమాక్స్ ధియేటర్ వద్దనున్న ఖాళీ స్థలంలోకి తరలించారు. మధ్యాహ్నాం తర్వాత అప్పర్ ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనం ముగిసినా, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాల్లో మండపాలు క్యూ కట్టి కన్పించాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన 40 క్రేన్లతో పాటు 74 బేబీ పాండ్లు, అయిదు ప్రధాన చెరువులతో పాటు మొత్తం 21 చెరువుల వద్ద మొత్తం కలిపి జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షల 68 వేల 755 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
Also Read: BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!
ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్
కానీ సాయంత్రం అయిదారు గంటల తర్వాత కూడా గణేశ్ మండపాలు క్యూ కట్టి కన్పించటంతో నిమజ్జనం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశమున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం వేళలో లక్డీకాపూల్ అయోధ్య జంక్షన్, లిబర్టీ చౌరస్తా, ఖైరతాబాద్ జంక్షన్ తో పాటు ట్యాంక్ బండ్ నుంచి రాణిగంజ్(Raniganj), సికిందరాబాద్(Secunderabad), హిమాయత్ సాగర్(Himayat Sagar), లోయర్ ట్యాంక్ బండ్(Lower Tank Bund), దోమల్ గూడ(Domalguda) తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయోధ్య జంక్షన్, అటూ ఖైరతాబాద్ జంక్షన్ లోని ట్రాఫిక్ జామ్ ఎఫెక్టు మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వరకు పడింది. అలాగే పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు వాహానాలు క్యూ కట్టడంతో లిబర్టీ నుంచి ఖైరతాబాద్ వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అలాగే అప్పర్ ట్యాంక్ బండ్ కు నిమజ్జనానికి వచ్చిన వాహానాలను రాణిగంజ్ మీదుగా తరలించటంతో సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ తలెత్తింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వినాయక మండపాలు నిమజ్జనం కోసం క్యూ కట్టాయి. వినాయక నిమజ్జనం నెమ్మదిగా సాగటం పై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు, సలహాలివ్వటంతో మధ్యాహ్నాం నుంచి నిమజ్జనం ఊపందుకుందని రాత్రికి ముగిసింది.
టస్కర్ ఢీ.. పారిశుధ్య కార్మికురాలు మృతి
బషీర్ బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపునకు వచ్చే మెయిన్ రోడ్డులో జీహెచ్ఎంసీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులును నిమజ్జనానికి వచ్చిన టస్కర్ వాహానం ఢీ కొట్టింది. దోమల్ గూడ కు చెందిన రేణుక (50) ను టస్కర్ బలంగా కొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయిన ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం తెల్సుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ హుటాహుటీన హాస్పిటల్ కు చేరుకుని కార్మికురాలి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కార్మికురాలి పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Also Read: JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..
ప్రతి వంద మీటర్లకు ఓ శానిటేషన్ టీమ్
గణేశ్ నిమజ్జనం చెత్త, వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించేందుకు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకున్న 21 కిలోమీరట్ల శోభా యాత్ర రూట్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మొత్తం 303 కిలోమీటర్ల పొడువున నిమజ్జనం రూట్ లో జీహెచ్ఎంసీ స్వచ్ఛతకు పెద్ద పీట వేసింది. సుమారు 14 వేల వేల 500 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించిన జీహెచ్ఎంసీ సాగర్ చుట్టూ కూడా ప్రతి వంద మీటర్లకు ఓ శానిటేషన్ టీమ్ ను అందుబాటులో ఉంచారు. వీరంత ప్రతి ఎనిమిది గంటలకు ఓ షిఫ్టు చొప్పున విధులు నిర్వర్తించారు. షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించే ఈ టీమ్ లోని కార్మికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం ఉచిత భోజనంతో పాటు రెస్టు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
జోన్ల వారీగా నిమజ్జనమైన విగ్రహాలు
జోన్ 1.5 నుంచి 3 అడుగుల విగ్రహాలు 3 కన్నా ఎక్కువ అడుగులు మొత్తం విగ్రహాలు
ఎల్బీనగర్ 14763 23037 37800
చార్మినార్ 11065 12388 23453
ఖైరతాబాద్ 23765 39703 63468
శేరిలింగంపల్లి 14089 28810 42899
కూకట్ పల్లి 10146 52477 62623
సికిందరాబాద్ 21954 16558 38512
మొత్తం 95782 172973 268755