GHMC Revenue: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ఆదాయ వనరుల్లో ఒకటైన భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణాలు పూర్తయిన భవనాలకు జారీ చేసే అక్యుపెన్సీ సర్టిఫికెట్లతో ఈ ఏటా జీహెచ్ఎంసీ(GHMC)కి ఆదాయం పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. కొత్త విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుఆకర్షించడం, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన క్యాంప్ ఆఫీసులు హైదరాబాద్ లో నెలకొల్పటంతో ఆఫీస్ స్పేస్‌ల ఆక్యుపెన్సీ డిమాండ్ బాగా పెరుగుతుంది. దీనికి తోడు నివాస గృహాల విక్రయాలు పెరగడం, ప్రస్తుతమున్న నిర్మాణాలు అదనంగా అంతస్తుల నిర్మాణం కోసం దరఖాస్తులను సమర్పించటం వంటివి ఆదాయ పెరిగేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
Also Read: Hair Loss Solution: మీకు బట్టతల ఉందా.. అయితే, నెలకు రూ. 50 వేలు మీ అకౌంట్లో పడినట్లే?
ఈ పురోగతిలో కీలక పాత్ర
దీనికి తోడు హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళ అంతస్తుల ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ(GHMC) టౌన్ ప్లానింగ్ విభాగం, ఈ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తూ సంస్థ ఆదాయానికి గణనీయంగా తోడ్పడుతోంది. బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ల దరఖాస్తులను ‘బిల్డ్‌నౌ’ అనే ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నారు. ఇందులో ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో వంటి మాడ్యూల్స్ ద్వారా పర్మిషన్లు వేగంగా మంజూరవుతున్నాయి.
జారీ చేసిన అనుమతులు..సమకూరిన ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-2026) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం 4389 బిల్డింగ్ పర్మిషన్లను జారీ చేయటంతో పాటు 1008 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌లు జారీ చేసి, ఈ రెండు మార్గాల ద్వారా రూ. 759.98 కోట్లు ఆదాయం సాధించినట్లు ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024-2025) ఇదే సమయానికి సమకూరిన రూ. 399.61 కోట్లు ఆదాయంతో పోల్చితే, ఈ సారి అదనంగా 90 శాతం ఆదాయం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బిల్డ్‌నౌ అప్లికేషన్ విశేషాలు
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా మార్చి 20, 2025న ప్రారంభించిన ‘బిల్డ్‌నౌ’ అప్లికేషన్ తో మరింత వేగవంతంగా నిర్మాణ అనుమతులు మంజూరవుతున్నాయి. ప్రక్రియను వేగవంతం చేయటంతో పాటు నిర్మించనున్న భవనం 3డీ వ్యూ వంటివి అందుబాటులోకి రావటం కూడా ఆదాయం పెరిగేందుకు ముఖ్య కారణం. గతంలో ఇదే రకంగా అమలు చేసిన టీజీబీపాస్ అప్లికేషన్ స్థానంలో వచ్చిన ఈ కొత్త వ్యవస్థ పూర్తిగా ఆన్‌లైన్‌లో, అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందిస్తోంది.
సేవలు మరింత వేగం
దీని వల్ల సేవలు వేగవంతంగా అందటంతో పాటు పారదర్శకత కూడా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) నేరుగా పర్యవేక్షిస్తున్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లోని దరఖాస్తులను సీఎం నేరుగా ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిశీలించటంతో పాటు పరిష్కారంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు సమీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో సేవలు మరింత వేగవంతమయ్యాయి. హెచ్ఎండీఏ లో భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యమవుతున్నాయన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఇటీవలే హెచ్ఎండీఏ అధికారుల తీరుపై సీరియస్ అయిన విషయం తెల్సిందే. ఈ పరిణామంతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గాడీన పెట్టేందుకు పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు చేపట్టనున్నారు.