Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ 2026ను దృష్టిలో ఉంచుకొని టీమ్ నిర్మాణాత్మక మార్పులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సమీక్షలో.. అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టాలంటూ రాహుల్ ద్రవిడ్‌కు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఆఫర్ ఇచ్చింది. అయితే, ద్రవిడ్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని, జట్టు కోచ్‌గా బాధ్యతల నుంచి దిగిపోతానంటూ చెప్పాడని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ద్రవిడ్‌కు ఫ్రాంచైజీ మరింత విస్తృతమైన బాధ్యతను ఆఫర్ చేసినప్పటికీ అంగీకరించలేదని, కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ తెలిపాడని వివరించింది. ‘‘ రాజస్థాన్ రాయల్స్ ప్రయాణంలో రాహుల్ ద్రవిడ్ ఎన్నో ఏళ్లపాటు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ఎంతగానో ప్రభావితం చేసింది. టీమ్‌లో బలమైన విలువలు, ఫ్రాంచైజీతో విడదీయరాని సంస్కృతిని నెలకొల్పి, బలమైన ముద్ర వేశారు. ప్రాంచైజీకి అత్యద్భుతమైన సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్‌కు రాజస్థాన్ రాయల్స్, టీమ్ ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అభిమానులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు’’ అని ఒక ప్రకటనలో ఫ్రాంచైజీ పేర్కొంది.
నిజానికి టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ కొన్నేళ్లపాటు బాధ్యతలు నిర్వహించాడు. అతడి పర్యవేక్షణలో భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. భారత్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కొన్నేళ్ల కాలానికి ఈ ఒప్పందం జరిగినట్టు నాడు ప్రకటించారు. కానీ, ఒక్క ఏడాది కూడా గడవక ముందే వైదొలగడం వెనుక కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే, ద్రవిడ్ లేకుండానే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026ను ఆడనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే యాజమాన్యం మొదలుపెట్టింది.
Read Also- Bigg Boss Telugu 9: ఎంట్రీకి సిద్ధమవుతున్న ఫైర్ బ్రాండ్!.. అయితే మాత్రం పూనకాలే..
కాగా, ఐపీఎల్ 2012, 2013లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ నడిపించాడు. 2014, 2015 సీజన్లలో జట్టుకు మెంటర్‌గా వ్యవహరించాడు. తిరిగి ఐపీఎల్ 2025లో కోచ్‌గా రాజస్థాన్ రాయల్స్‌తో తన ప్రస్థానాన్ని పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 2008లో ఆరంభ ఐపీఎల్ ఎడిషన్‌ను సొంతం చేసింది. రెండోసారి టైటిల్‌ను ముద్దాడేందుకు ఎంతగానో ఎదురుచూస్తోంది. కానీ, సాధ్యపడడం లేదు.
గత సీజన్ విషయానికి వస్తే, రాజస్థాన్ రాయల్స్ మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కేవలం తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. శాంసన్ అందుబాటులో లేకపోవడంతో రియాన్ పరాగ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.