Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను బలిగొన్న ఉగ్రభూతానికి గట్టి బుద్ధి చెబుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (PoK) ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి మూడు నెలలు పూర్తయ్యాయి. పాకిస్థాన్ ప్రతిఘటించడంతో ఇరు దేశాల సేనల మధ్య భీకర సైనిక ఘర్షణ జరగడం, భారత సేనలు సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించిన విషయాలు తెలిసిందే. పాకిస్థాన్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రాజీకి వచ్చేంతలా భారత సేనలు చావుదెబ్బకొట్టాయి. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఎన్ని ఆయుధాలను ఉపయోగించింది, ఎన్ని లక్ష్యాలపై గురిపెట్టిందనే కొత్త విషయాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కొత్త దృశ్యాలు, వివరాలను ఆయన పంచుకున్నారు.
Read Also- High BP Reduce Tips: హైబీపీ ఉన్నవారు ఈ చిట్కాలను పాటించాల్సిందే!
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించిందని, ఈలోగానే పాకిస్థాన్ కాల్పుల విరమణ చేద్దామంటూ రాజీకి వచ్చిందని నర్మదేశ్వర్ తివారీ వెల్లడించారు. ‘‘భారత్‌కు అందిన జాబితా ప్రకారం, మనం దాడి చేయడానికి చాలా టార్గెట్లు ఉన్నాయి. కానీ, అందులో 9 లక్ష్యాలను మాత్రమే ఎంచుకొని ధ్వంసం చేశాం’’ అని ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ చెప్పారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ నిర్వహించిన ‘డిఫెన్స్ సమ్మిట్’లో శనివారం ఆయన మాట్లాడారు.
‘‘ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 50 కంటే తక్కువ ఆయుధాల ద్వారా ఉద్రిక్తతను పరిష్కరించగలిగాం. ఈ సందర్భంగా మేము చెప్పదలచుకున్న విషయం ఇదే. యుద్ధాన్ని మొదలుపెట్టడం చాలా తేలిక. కానీ, దానిని ముగించడం అంత సులభం కాదు. మానసికంగా గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం ఇదే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన సైనికులు దృఢంగా సిద్ధపడి ఉంటారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మేము ఆలోచించాం’’ అని నర్మదేశ్వర్ తివారీ అన్నారు.
ఐఏసీసీఎస్ కీలక పాత్ర
ఆపరేషన్ సిందూర్ విజయంలో భారతదేశానికి చెందిన ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) కీలక పాత్ర పోషించిందని ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ పేర్కొన్నారు. ఈ సిస్టమ్ దాడి చేయగలదు, అదేవిధంగా రక్షణ కూడా కల్పించగలదని, ఆపరేషన్ సిందూర్ సమయంలో బాగా పనిచేసిందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ జరిపిన ప్రారంభ దాడులను తట్టుకుని ‘గట్టి ప్రతిస్పందన’ ఇవ్వడానికి ఈ సిస్టమ్ అనువైన అవకాశాన్ని కల్పించిందని, సైనిక ఉద్రిక్తత నుంచి పాకిస్థాన్ వెనక్కి తగ్గడంలో ఐఏసీసీఎస్ ఎంతగానో ఉపయోగపడిందని ఆయన చెప్పారు.
ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి ప్రధానంగా మూడు కోణాల్లో ఆదేశాలు అందాయని నర్మదేశ్వర్ తివారీ చెప్పారు. జరిపిన దాడి శత్రుదేశానికి కనిపించేలా ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి దాడులకు పాల్పడకుండా గట్టి సందేశం ఇచ్చినట్టుగా ఉండాలని, సైనిక బలగాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా సందేశం అందిందని ఆయన వివరించారు. సంప్రదాయక యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున, అందుకు సిద్దంగా ఉండాలంటూ ఆదేశాలు అందాయని చెప్పారు. పాకిస్థాన్ చర్యలకు ప్రతిస్పందనగా ప్రణాళిక చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అతిపెద్ద సానుకూల అంశం ఇదేనని నర్మదేశ్వర్ తివారీ చెప్పారు. భవిష్యత్తు పరంగా చూస్తే, నిజంగా ఏమైనా అనూహ్య పరిణామాలు ఎదురైనా ఎంత వేగంగా స్పందించగలమనేది చూపించామని తెలిపారు.