SHE Teams: ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు వెంటపడి మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలకు రాచకొండ షీ టీమ్స్(Rachakonda She Teams) చెక్ పెడుతున్నాయి. డెకాయ్ ఆపరేషన్లు(Decoy operations) జరుపుతూ పక్కా ఆధారాలతో ఆవారాలను అరెస్ట్ చేస్తున్నాయి. గడిచిన పదిహేను రోజుల్లోనే కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో 152మంది జులాయిలను అదుపులోకి తీసుకున్నాయి. ఇలా పట్టుబడ్డ పోకిరీలకు మంగళవారం వారి తల్లిదండ్రుల సమక్షంలో ఎల్బీనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ జరిపినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి(DCP Ushan Rani) తెలిపారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా
పట్టుబడ్డ వారిలో 73మంది మేజర్లు, 79మంది మైనర్లు ఉన్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా వేధించిన కేసులు 33 ఉండగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం(Social media platform)ల ద్వారా వేధించిన కేసులు 78 ఉన్నట్టు చెప్పారు. నేరుగా వేధింపులకు పాల్పడ్డ కేసులు 94 ఉన్నాయన్నారు. వీటిలో 3 క్రిమినల్ కేసులు, 51 పెట్టీ కేసులు ఉన్నట్టుగా వివరించారు. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ శారీరక వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేసినట్టు తెలిపారు.
Also Read: CI Rajesh: పేరుకే రక్షక భటుడు.. లోపల మాత్రం అక్రమార్కుడు.. ఎవరంటే?
డెకాయ్ ఆపరేషన్లు
పెళ్లయిన సహోద్యోగినిని వేధిస్తున్న వ్యక్తితోపాటు ఇంజనీరింగ్ విద్యార్థినిని మార్ఫింగ్ ఫోటో(Morphing photo)లతో బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకున్ని కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో 69 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. దీంట్లో మహిళా చట్టాలు, వారికి ఉండే హక్కులు, పోకిరీల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియ చేశామన్నారు. మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్లు జరిపి ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కౌన్సెలింగ్ లో సీఐ అంజయ్య(CI Anjaiah), అడ్మిన్ ఎస్ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సెలర్లు పాల్గొన్నారు.
Also Read: Hydraa: నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు.. ప్రజావాణికి 48 ఫిర్యాదులు