Hydraa: వర్షం కురుస్తున్నపుడు సహాయక చర్యలు, మిగతా సమయంలో పూడికను తొలగించడం పనులు నిరంతరాయంగా జరుగుతున్నట్లు హడ్రా అధికారులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు నుంచి పూడిక తొలగింపు పనులు నిర్వహిస్తుండగా, మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు అందుబాటులోకి వచ్చిన జులై 1వ తేదీ నుంచి హైడ్రా(Hydraa) వివిధ రకాల పనులను మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది. ఇలా ఇప్పటి వరకూ 15 వేల 665 క్యాచ్‌పిట్లను హైడ్రా(Hydraa) క్లీన్ చేసినట్లు, 359 కల్వర్టులలో పూడికను తొలగించినట్లు వెల్లడించింది. 1670 చోట్ల నాలాల్లో చెత్తను బయటకు తీసి తరలించినట్లు హైడ్రా వెల్లడించింది. ఇలా 4609 వాటర్ లాగింగ్ పాయింట్లను కూడా క్లియర్ చేసింది. వీటికి తోడు వర్షాల వేళ 4 వేల 974 ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త ను తొలగించింనట్లు, ఇలా మొత్తం 27 వేల 272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులను జూలై ఆరంభం నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించినట్లు హైడ్రా తెలిపింది. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమాలను నిర్వహించి వరద కాలువలు, నాలాల పరిరక్షణలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తోంది. నాలాల్లో చెత్త వేయకుండా పర్యవేక్షించాలని వారిలో చైతన్యం నింపుతున్నట్లు పేర్కొంది.
పడిపోయిన చెట్ల తొలగింపు
బలమైన ఈదురు గాలులతో వర్షం కురిసినపుడు నగరంలో చెట్లు నేలకొరుగుతున్నాయి. రహదారులకు అడ్డంగా పడి వాహన రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయంగా మారుతున్నాయి. జోరున వర్షం పడుతుండగానే పడిపోయిన చెట్లను తొలగించాల్సి వస్తుందని హైడ్రా వెల్లడించింది. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినప్పుడు హైడ్రా భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితులుంటే, బైకులపై వెళ్లి చెట్టు కొమ్మలను కట్ చేసి తొలగించేలా హైడ్రా బృందాలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి మొత్తం 810 చెట్లను తొలగించింది హైడ్రా. భారీ వృక్షాలు పడినప్పుడు డీఆర్ ఎఫ్ వాహనాలు రంగంలోకి దిగి తొలగిస్తాయి. వీటికి తోడు గణేష్ ఉత్సవాలు సందర్భంగా విగ్రహాలు తరలించినప్పుడు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను హైడ్రా తొలగిస్తోంది.
Also Read: Drishyam Style Murder: దేశ రాజధానిలో సంచలన మర్డర్.. దృశ్యం తరహాలో భార్యను లేపేసిన భర్త!
తలాబ్ చంచలంలో చెత్త తొలగింపు
మలక్‌పేట, డబీర్‌పురా దర్వాజా దగ్గర గల గంగా నగర్ నాలలో భారీగా పోగైన చెత్తను హైడ్రా తొలగించింది. ఒకే రోజు 15 ట్రక్కుల చెత్త ఇక్కడి నుంచి తరలించినట్లు వెల్లడించింది. అల్వాల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, టోలిచౌకి, తలాబ్‌చంచలంలో పెద్ద ఎత్తున పూడిక తీత పనులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. జేసీబీ సహాయంతో నాలా రిటైనింగ్ వాల్ దగ్గర పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. అమీర్‌పేట ((AmerPet)) మైత్రి వనం వద్ద ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చిన చెత్తను తొలగించే పని నిరంతరంగా సాగుతుందని వెల్లడించింది. ఇక్కడ శాశ్వత పరిష్కారం దొరికే వరకూ ఈ ప్రక్రియను కొనసాగించి, వరద నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. టోలీచౌక్ ప్రాంతంలో బుల్కాపూర్ నాలాతో పాటు గౌరీశంకర్ బస్తీలో నాలాల క్లీనింగ్ దాదాపు పూర్తయినట్లు, పాతబస్తీలోని తలాబ్‌చంచలన్ ప్రాంతంలో నాలాలోని పూడికను తొలగించే పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మొత్తానికి ఈ ఏడాది వర్షాల వేళ చాలా వరకూ ప్రయాణికులకు, నివాసితులకు ఇబ్బందులు లేకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
Also Read: Srinivas Goud on Congress: గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగ కూడదనే కుట్ర: శ్రీనివాస్ గౌడ్