Drishyam Style Murder: దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. 30 ఏళ్ల మహిళను ఆమె భర్తే హత్య చేసి దృశ్యం సినిమా తరహాలో సమాధిలో పాతిపెట్టాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా భార్య ప్రేమికుడితో పారిపోయిందన్న నాటకానికి భర్త తెరలేపాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేయడంతో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.
వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా (Amroha) ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల పెయింటర్ షాదాబ్ అలీ (Shabab Ali), తన భార్య ఫాతిమా (Fatima)ను చంపినట్లు దిల్లీ డీసీపీ అంకిత్ చౌహాన్ (Ankit Chauhan) తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం షాదాబ్ తన భార్యకు పురుగుల మందు, నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేశాడు. అనంతరం సహచరులు షారుక్ ఖాన్ (Shahrukh Khan), తన్వీర్ (Tanveer), మరొకరితో కలిసి ఫాతిమా మృతదేహాన్ని కారులో మెహ్రాలి (Mehrauli)కి తీసుకెళ్లి అక్కడ సమాధి చేశాడు. ఆమె బట్టలను కాలువలో పడేశాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన సొంతూరుకి వెళ్లిపోయాడు.
భార్య లేచిపోయినట్లు కట్టుకథ
అమ్రోహాకు వెళ్లిన అనంతరం తన భార్య ఫోన్ నుంచి షాదాబ్ తన మెుబైల్ కు మెసేజ్ పంపుకున్నాడు. తాను ప్రియుడితో కలిసి వెళ్లిపోతున్నానని.. అతడ్నే పెళ్లి చేసుకుంటానని భార్య సందేశం పంపినట్లు బంధువులను నమ్మించాడు. అయితే ఫాతీమా కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితుడు దిల్లీలోని మెహ్రాలి పోలీసు స్టేషన్ (Mehrauli Police Station)లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొదట ఆమె కిడ్నాప్ అయిందని అనుమానించారు. విచారణలో భాగంగా షాదాబ్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీను పరిశీలించారు. ఫాతిమా బాడీని ఆమె భర్త, అతడి సహచరులు కలిసి కారులో తీసుకెళ్లడం అందులో కనిపించింది.
భార్యపై అనుమానంతోనే..
షాదాబ్ ను అదుపులోకి తీసుకున్న దిల్లీలోని మెహ్రాలీ పోలీసులు.. భార్య గురించి ఆరా తీశారు. మొదట షాదాబ్ నేరం అంగీకరించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో చివరకూ భార్యను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. అయితే భార్య శవాన్ని కాలువలో పడేశానని మెుదట అబద్దం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత ఆమెను సమాధి చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు షాదాబ్ అంగీకరించాడు.
Also Read: Madhya Pradesh: షాకింగ్ ఘటన.. లేడీ టీచర్‌పై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన స్టూడెంట్
హత్య ఎలా జరిగిందంటే?
షాదాబ్ ఇచ్చిన మాత్రలతో ఫాతిమా తొలుత స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను ఫతేహ్‌పూర్ బెరి (Fatehpur Beri)లో తాను కట్టిస్తున్న ఇంటికి తీసుకెళ్లి జూలై 31 వరకు అక్కడే ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు పురుగుల మందు తినిపించాడు. దీంతో ఫాతిమా తీవ్ర అనారోగ్యానికి గురైంది. దగ్గర్లోని కాంపౌండర్ కు చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగస్టు 1న ఫాతిమా ప్రాణాలు విడిచింది. మరుసటి రాత్రి షాదాబ్, షారుఖ్, తన్వీర్ కలిసి ఆమె మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సమాధిలో పాతిపెట్టారు. ఆగస్టు 15న షాదాబ్ ఇచ్చిన అంగీకార వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఫాతిమా శవాన్ని బయటకు తీశారు. దీంతో ఈ కేసు బహిర్గతమైంది. ప్రస్తుతం షాదాబ్ తో పాటు అతడికి సహకరించిన షారుక్, తన్వీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వెతుకున్నారు.