Putin Bodyguards: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో అలాస్కా వేదికగా పుతిన్ భేటిన అయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా పుతిన్ మలాన్ని సేకరించేందుకు ఓ సూట్ కేసును ఆయన బాడీ గార్డ్స్ తీసుకెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సూట్ కేసు ద్వారా పుతిన్ మలాన్ని సేకరించి.. తమ వెంట రష్యాకు తీసుకెళ్లిపోయారని తెలిపాయి.
అలా ఎందుకు చేశారంటే?
రష్యా అధ్యక్షుడు పుతిన్ మలాన్ని సేకరించడం వెనుక బలమైన కారణమే ఉందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. పుతిన్ ఆరోగ్య రహస్యాలను.. ఆయన మలం నుంచి తెలుసుకునే అవకాశమున్నందున ఆయన అంగరక్షకులు ఇలా సూట్ కేసులో సేకరించినట్లు సమాచారం. తద్వారా విదేశీ శక్తుల చేతుల్లోకి ఎంతో సున్నితమైన ఆరోగ్య రహస్యాలు వెళ్లకుండా వారు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాస్కానే కాకుండా పుతిన్ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఇలా మలాన్ని సేకరించే సూట్ కేసును బాడీగార్డ్స్ క్యారీ చేస్తారని ఓ నివేదిక తెలిపింది.
పుతిన్‌కు భారీ బందోబస్తు.
ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ మ్యాచ్ పత్రికలో జర్నలిస్టులుగా చేసే రెజిస్ జెంటే, మిఖాయిల్ రూబిన్ అందించిన నివేదిక ప్రకారం.. రష్యా అధ్యక్షుడి ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (FPS) సభ్యులు పుతిన్ మల విసర్జన సహా శరీర వ్యర్థాలను సేకరించి ప్రత్యేక సంచుల్లో నిల్వ చేస్తారు. అనంతరం ప్రత్యేక బ్రీఫ్ కేస్‌లలో వాటిని తీసుకెళ్తారు. ఈ చర్య కొత్తది కాదు. 2017 మేలో పుతిన్ ఫ్రాన్స్ పర్యటన సమయంలో కూడా ఇదే విధానాన్ని ఆయన బాడీగార్డ్స్ పాటించారని నివేదిక తెలిపింది. విదేశీ గూఢచార సంస్థలకు ఆయన ఆరోగ్యంపై సమాచారం దొరకకుండా ఈ చర్యలు తీసుకున్నారని స్పష్టం చేసింది.
1999 నుంచి అమలు..!
మరో జర్నలిస్ట్ ఫరీదా రుస్తమోవా ప్రకారం.. వియన్నా పర్యటనలో కూడా పుతిన్ ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ప్రత్యేకంగా పోర్టబుల్ టాయిలెట్ ఉపయోగించారని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ బాధ్యతలు చేపట్టినప్పటి (1999) నుంచి ఈ విధానం అమలవుతోందని ఫరీదా తెలిపారు.
Also Read: Army jawan: దేశంలో దారుణం.. స్తంభానికి కట్టేసి మరి.. జవాన్‌ను చితకబాదారు!
పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు..
72 ఏళ్ల పుతిన్ ఆరోగ్యంపై గతంలో ఎన్నో ఊహాగానాలు ప్రచారమయ్యాయి. 2022లో ఆయన కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ కాళ్లు, చేతులు వణుకుతూ కనిపించడం అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. పుతిన్ ‘పార్కిన్సన్స్ వ్యాధి’ వంటి నర సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండొచ్చని వైద్యుడు బాబ్ బెరూఖిమ్ ఓ నివేదికలో తెలిపారు. అలాగే 2023లో బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోను కలిసినప్పుడు కూడా ఆయన తన కూర్చీలో చాలా అసౌకర్యంగా కనిపించారు. అంతకుముందు 2022లో పుతిన్ బాత్రూమ్ లో కిందపడిపోయి తనపై తానే మల విసర్జన చేసుకున్నారని టెలిగ్రామ్ ఛానల్ ప్రచారం చేసింది. అయితే ఇవన్నీ పుకార్లేనని క్రెమ్లిన్ ఖండించడం గమనార్హం.