Kazana jewellers Robbery: హైదరాబాద్ లో దోపిడి గ్యాంగ్ రెచ్చిపోయింది. పట్టపగలు నగల షాపును దోచేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ చందానగర్ లోని ఖజనా జ్యువెలర్స్ షాపును ఓ ముఠా మంగళవారం టార్గెట్ చేసింది. షాపు తెరిచే సమయానికి అక్కడకు వచ్చిన దుండగులు.. గన్ తో బెదిరించి లోపలికి ప్రవేశించారు. అనంతరం లాకర్ కీ ఇవ్వాలని దొంగలు పట్టుబట్టగా.. అందుకు అసిస్టెంట్ మేనేజర్ నిరాకరించారు. దీంతో అతడిపై ముఠా కాల్పులు జరిపింది.
Also Read: 12 Year-Old Girl Assaulted: దేశంలో అత్యంత ఘోరం.. 12 ఏళ్ల బాలికపై.. 200 మంది అత్యాచారం!
అంతటితో ఆగకుండా షాపుల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలకొట్టి.. దాడులకు పాల్పడింది. దీంతో భయంతో జ్యువెలరీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిని గమనించిన దోపిడి గ్యాంగ్.. అక్కడి నుంచి పరారయ్యింది. మెుత్తం 6 మంది సభ్యులు.. ఖజానా జ్యువెలరీలోకి వచ్చి దొంగతనానికి యత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు నగల షాపు వద్దకు చేరుకున్న చందానగర్ పోలీసులు.. సిబ్బందిని అడిగి దాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఇదిలాఉంటే దుండగుల కాల్పుల్లో ఖజానా షాపు అసిస్టెంట్ మేనేజర్ కు గాయలయ్యాయి. అతడ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చెప్పినట్లు సిబ్బంది వినకపోవడంతోనే దోపిడి ముఠా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు వారంతా ముఖాలకు మాస్క్ లతో వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పోలీసుల సైరన్ వినిపించడంతో అక్కడ నుంచి వారంతా పారిపోయినట్లు పేర్కొంటున్నారు.
ఖజానా జ్యువెలర్స్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్వయంగా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇదిలాఉంటే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. దోపిడికి యత్నించిన ఆరుగురు దుండగులు.. మియాపూర్ నుంచి చందానగర్ కు 3 బైకుల్లో వచ్చినట్లు గుర్తించారు. పక్కా ప్లాన్ తో ముందే రెక్కీ నిర్వహించి ఈ దోపిడికి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బైకులను ఖజానా జువెలర్స్ సమీపంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆరుగురు కలిసి ఒకేసారి ఖజానా జ్యువెలర్స్ లోపలికి వెళ్లినట్లు పేర్కొన్నారు. గోల్డ్ లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో వెండి ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వచ్చిన మూడు బైకుల ద్వారానే చందానగర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా మహారాష్ట్ర వైపునకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో 3 కమీషనరేట్ల పోలీసులతోపాటు మహారాష్ట్ర సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాల పోలీసులను, చెక్ పోస్టులను సీపీ అవినాష్ మహంతి అప్రమత్తం చేశారు.