Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మోంటానాలోని ఒక విమానాశ్రయం (Montana airport)లో ఒక చిన్న విమానాన్ని ల్యాండ్ చేస్తుండగా అది ప్రమాదవశాత్తు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్క్ చేసిన ప్రాంతంలో పలు విమానాలు ఉండటంతో మంటల్లో అవి కూడా దహనమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) స్పష్టం చేసింది.
క్షణాల్లో మంటలు..
ఎఫ్ఏఏతో పాటు కలిస్పెల్ పోలీసు చీఫ్ జోర్డాన్ వెనెజియో (Kalispell Police Chief Jordan Venezio) తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రయాణికులు ఉన్న ఆ సింగిల్-ఇంజిన్ విమానం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలిస్పెల్ సిటీ ఎయిర్‌పోర్ట్ (Kalispell City Airport)లో ల్యాండ్ అవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పైలట్ నియంత్రణ కోల్పోవడంతో విమానం రన్‌వేపై క్రాష్ అయ్యింది. అనంతరం పక్కన నిలిపి ఉన్న అనేక విమానాలను అది ఢీకొంది. దీంతో పలు విమానాలకు మంటలు అంటుకున్నాయి. అనంతరం అవి పక్కనే ఉన్న పొదలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. మంటలను ఆర్పివేశారు.
బయటకొచ్చేసిన ప్రయాణికులు
మోంటానాలోని కలిస్పెల్ నగరం.. 30,000 మంది జనాభా కలిగిన చిన్న ప్రాంతం. ఇక్కడ ఉన్న విమానాశ్రయం కూడా చిన్నదే. ఇదిలా ఉంటే కలిస్పెల్ ఫైర్ చీఫ్ జే హేగన్ (Kalispell Fire Chief Jay Hagen) మాట్లాడుతూ.. ప్రత్యక్ష సాక్షులు రన్‌వే చివర ఒక విమానం క్రాష్-ల్యాండింగ్ అయ్యి మరో విమానాన్ని ఢీకొట్టినట్లు తెలిపారని చెప్పారు. అందులోని ప్రయాణికులు విమానం ఆగిన వెంటనే స్వయంగా బయటకు వచ్చారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని అక్కడికక్కడే చికిత్స అందించారు.
విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం!
అమెరికాలోని ఓ ఎయిర్‌పోర్టులో ప్రమాదం
పార్కింగ్ చేసిన విమానంపైకి దూసుకెళ్లిన మరో చిన్న విమానం
మోంటానాలోని కాలిస్పెల్ సిటీలోని విమానాశ్రయంలో టీబీఎం 700 టర్బోప్రాప్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నం
ఈ క్రమంలో రన్‌వే చివర క్రాష్… pic.twitter.com/BEFddJDWLz
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2025
Also Read: Anupama Parameswaran: రోడ్డుపై పరదాలు అమ్ముతున్న అనుపమ.. ఇనుప సామాన్లు కూడా అమ్ము అంటూ నెటిజన్ కామెంట్
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ..
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రకారం.. ప్రమాదానికి గురైన చిన్న విమానం వాషింగ్టన్‌లోని పుల్మాన్ నుంచి బయలుదేరింది. ఇది సోకాటా TBM 700 టర్బోప్రాప్ (Socata TBM 700 turboprop) మోడల్ కు చెందింది. 2011లో తయారు చేయబడిన ఈ విమానం.. పుల్మాన్‌కు చెందిన మీటర్ స్కై ఎల్ఎల్‌సీ (Meter Sky LLC of Pullman) అనే కంపెనీకి తరపున సేవలు అందిస్తోంది. అయితే ఇలా నిలిపి ఉంచిన విమానాలను ఢీకొట్టిన అనుభవాలు గతంలోనూ ఎదురైనట్లు విమాన భద్రతా నిపుణులు జెఫ్ గజెట్టి (Jeff Guzzetti) అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరిజోనా (Arizona)లోని స్కాట్స్‌డేల్ (Scottsdale)లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక గాయకుడికి చెందిన ప్రైవేటు విమానం (Private Plane).. నిలిపిఉనన గల్ఫ్ స్ట్రీమ్ విమానాన్ని ఢీకొట్టినట్లు గుర్తుచేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు పేర్కొన్నారు.