Gurukulam: తెలంగాణ గురుకులాల్లో కామన్ మెనూ కాంట్రవర్సీగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన విధానంపై కొందరు కాంట్రాక్టర్లు కిరికిరి పెడుతున్నట్లు సమాచారం. సమస్యలు సృష్టిస్తూ విద్యార్ధులు, టీచర్లు, అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. గురుకులా(Gurukul)ల్లో ఆహారం సప్లై చేసే కాంట్రాక్టు గడువు ఉన్నప్పటికీ, తాము సరఫరా చేయమని మొండికేస్తున్నట్లు తెలిసింది. పైగా అధికారులతో పాటు, కొత్త కాంట్రాక్టర్లను కూడా పాత కాంట్రాక్టర్లలో కొందరు ఏకంగా బెదిరింపులకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు 15 మంది కాంట్రాక్టర్లు ఓ టీమ్‌గా ఏర్పడి, ఇలాంటి వ్యవహారానికి ఒడిగట్టారని సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో విద్యార్ధులకు నష్టం జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
కాటేస్తే ఎట్లా?
వాస్తవానికి సెప్టెంబరు 5 నుంచి కామన్ మెనూ పాలసీని అమలు చేయాలని ఆఫీసర్లు తగిన కసరత్తు చేస్తున్నారు. దీంతో అన్ని గురుకులా (Gurukulam)ల్లో ఒక రకమైన నాణ్యమైన, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందుతుందని సర్కార్ ఆలోచిస్తుంది. హెల్తీ, హైజీన్, న్యూట్రిషన్ పుడ్‌ను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, పాత కాంట్రాక్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సప్లై గడువు కంటే ముందే చేతులెఎత్తేసి, కొత్త కాంట్రాక్టర్లు రాకుండా అడ్డుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేయడం గమనార్హం. దీంతో విద్యార్థులకు అందించాల్సిన కూరగాయలు ఇతర ఆహార వస్తువులు సరఫరాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. అంతేగాక నిబద్ధతతో పనిచేస్తున్న మిగతా కాంట్రాక్టర్లకూ చెడ్డపేరు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.
పుడ్ పాయిజన్ల నేపథ్యంలో..
కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా గురుకులా(Gurukulam)ల్లో పుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కీలకమైన మార్పులు తీసుకుంటోంది. సెంట్రలైజ్డ్ ప్రోక్యూర్మెంట్‌తో పాటు కామన్ మెనూను అమలు చేయాలని ఆలోచించింది. దీంతో ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, శుభ్రతతో కూడిన, పోషకాహార భోజనం అందించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ, కొంతమంది కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం ఈ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ఈ పాత కాంట్రాక్టర్లలో కొందరి తీరుపై అధికారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టపరంగా, ఒప్పందం ముగిసే వరకు సరఫరా నిలిపివేయడం ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడుతుందని వివరించారు. అవసరమైతే కాంట్రాక్టు రద్దు, బ్లాక్‌లిస్ట్ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!