TS News:
ఇష్టారాజ్యంగా కార్యాలయంలో పైరవీలు
కార్యాలయంలో ప్రతి ఉద్యోగి మాటలు కాల్ రికార్డింగ్
తన మాట వినని ఉద్యోగులకు బ్లాక్ మెయిలింగ్
రూల్స్‌కు విరుద్ధంగా ఆర్డీవో కల్లూరు ఆఫీస్ నుంచి ఐడీవోసీ కలెక్టర్ కార్యాలయానికి డ్రైవర్‌గా బదిలీ
పైరవీలు, బ్లాక్‌మెయిల్, బెదిరింపులతో ఉద్యోగుల తీవ్ర ఆందోళన
ఖమ్మం, స్వేచ్ఛ: ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ జానీమియాపై కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పైరవీలు, బ్లాక్ మెయిల్, డీజిల్ బిల్లుల లోపాలు వంటి వివాదాలు తెరపైకి తెస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చి దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం… జానీమియా తొలుత కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా పనిచేశాడు. అక్కడ కొంతకాలం విధులు నిర్వహించిన తర్వాత, కార్యాలయ సిబ్బందితో గొడవలు పడుతూ, పథకం ప్రకారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (అదనపు కలెక్టర్) డ్రైవర్‌గా డిప్యూటేషన్‌పై అటాచ్ అయ్యాడు.
కాల్ రికార్డింగ్ ఆరోపణలు
కలెక్టర్ కార్యాలయంలో డ్రైవర్‌గా చేరిన నాటి నుంచి ఆఫీసులో ఉద్యోగులతో సంబంధిత పనుల గురించి చనువుగా మాట్లాడి, వారి మాటలను మొబైల్‌లో రికార్డు చేసి అవసరమైనప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, తన మాట వినని వారిని బెదిరించి పైరవీల ద్వారా పనులు జరుపుకుంటున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజానికి ముజామిల్ ఖాన్ (ఐఏఎస్) కలెక్టర్‌గా ఉన్న సమయంలో, జానీ మియా బదిలీ ఫైల్ పరిశీలించి ప్రవర్తన సరిగా లేదంటూ తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. అయితే, కొత్త కలెక్టర్ అనుదీప్ (ఐఏఎస్) బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సిబ్బందిని ఒత్తిడి చేసి తిరిగి బదిలీ ఫైల్‌ను ముందుకు తెచ్చి శాశ్వతంగా అదనపు కలెక్టర్ డ్రైవర్‌గా నియమించుకునేలా చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, వాహనాలకు కేటాయించే డీజిల్ బిల్లులలో 10–15 లీటర్ల వరకు విలువైన నగదును బంక్ వద్ద వసూలు చేసుకొని, మిగతా డీజిల్‌ను వాహనంలో నింపిస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీఐ సమాచారం కోరగానే..
డ్రైవర్ వ్యవహారంపై కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం (RTI) కింద జులై 4న దరఖాస్తు దాఖలైన విషయం తెలుసుకున్న డ్రైవర్ జానీమియా.. తాను జులై 25న ఆర్డీవో కార్యాలయంలో రిలీవ్ అయినట్టుగా, కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది జులై 31 వరకు 6 రోజులు అటెండెన్స్ వేశారని అందుకు అదనంగా తను 6 రోజుల డిప్యూటేషన్ జీతం పొందినట్టుగా పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన 6 రోజుల జీతం ఆగస్టు 4న చలానా రూపంలో తిరిగి ప్రభుత్వ ఖాతాలో చెల్లించి, తాను ఏ తప్పు చేయని ఒక నిజాయితీపరుడుగా జిల్లా కలెక్టర్ దృష్టిలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also- Cloud Burst: ఉత్తరాఖండ్‌లో ‘క్లౌడ్ బరస్ట్’ ప్రళయం.. గల్లంతైన ఇళ్లు
ముందస్తు రిలీవ్ లెటర్ కథ ఏమిటి?
కల్లూరు ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్డీవో రాజేందర్ గౌడ్ జులై 28న అధికారికంగా రిలీవ్ అయ్యాయి. అయినప్పటికీ డ్రైవర్ జానీ మియాకు జులై 25న ట్రాన్స్‌ఫర్ రిలీవింగ్ లెటర్ ఎందుకు ఇచ్చారని, ఈ ట్రాన్స్‌ఫర్ రిలీవింగ్ కోసం ఆర్డీవోను కూడా బ్లాక్‌మెయిల్ చేసి ఉండవచ్చన్న అనుమానాలు కార్యాలయ సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి.
సీసీ కెమెరాలలో రికార్డ్?
ఆగస్టు 1న మాజీ ఆర్డీవో రాజేందర్ గౌడ్ ఉదయం 8.30 గంటల సమయంలో కల్లూరు ఆర్డీవో కార్యాలయానికి రాగా, డ్రైవర్ జానిమియా కూడా అదే సమయంలో కార్యాలయానికి వెళ్లాడు. జులై 25న ట్రాన్స్‌ఫర్ రిలీవింగ్ లెటర్ తీసుకున్నట్లు అటెండర్ చూశాడని, ఈ తతంగమంతా ఆఫీస్‌లోని సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యి ఉంటుందని ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని సీసీ పుటేజ్ పరిశీలించాలని కోరుతున్నారట. డ్రైవర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న ఆర్డీవో కార్యాలయంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించడంతో పాటు, అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయాలని అంటున్నారు. అదేవిధంగా పెట్రోల్ బంక్‌లోని సిబ్బందిని విచారించి అసలు విషయాలు బయటకు తీయాలని అంటున్నారు. ఆరోపణలు నిజమని తేలిన పక్షంలో సంబంధిత డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also- Toxic Kitchen Items: మీ వంటగదిలోని ఈ పాత్రలు.. ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా?