Cloud Burst: దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మంగళవారం తీవ్ర ‘మేఘ విస్పోటనం’ (క్లౌడ్ బరస్ట్) (Cloud Burst) సంభవించింది. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ధారాలి అనే గ్రామాన్ని ఆకస్మిక వరదలు కకావికలం చేశాయి. ఉన్నపళంగా కొండల పైనుంచి వరదలు వచ్చి గ్రామం మీద పడ్డాయి. వరదలకు తోడు కొండచరియలు కూడా విరిగిపడడంతో తీవ్ర విధ్వంసం జరిగింది. చాలా ఇళ్లు కొట్టుకొనిపోయాయి. ఈ మెరుపు వరదల్లో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. ఇంకా చాలామంది గల్లంతు అయినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధారాలి గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓ లోయ ద్వారా మెరుపు వరద ప్రళయరూపంలో దూసుకొచ్చి, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లను ఈడ్చుకొని పోవడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీశారు. ఆపదలో ఉన్న బాధితులు భయంతో కేకలు వేయడం వీడియోలలో వినిపించింది.
ఉత్తరకాశీ పోలీసులు ఈ ప్రకృతి విపత్తునకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నదులకు దూరంగా ఉండాలంటూ స్థానిక ప్రజలకు సూచించారు. క్లౌడ్ బరస్ట్ ఘటనను దృష్టిలో పెట్టుకుని పిల్లలతో పాటు పెంపుడు జంతులను కూడా నదికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అందర్నీ హెచ్చరించారు.
సీఎం పుష్కర్ సింగ్ విచారం..
‘క్లౌడ్ బరస్ట్’ విలయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎస్ రంగంలోకి దిగాయని చెప్పారు. బృందాలు గాలింపు, రెస్క్యూ చర్యలు చేపట్టుతున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఐటీబీపీకి చెందిన మూడు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన నాలుగు బృందాలు ఘటన ప్రాంతానికి పంపించామని, అక్కడికి చేరుకొని వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించాయంటూ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టులో తెలిపారు. ఉత్తరకాశీ జిల్లా ధారాలి ప్రాంతంలో మేఘ విస్పోటనం కారణంగా జరిగిన భారీ నష్టం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా అధికారులు, ఇతర బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. అందరూ భద్రంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మరో ట్వీట్‌లో పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.
Read Also- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!
ఈ సీజన్‌లో వరదలే వరదలు
వర్షాకాల సీజన్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు నిరంతరంగా కురుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హరిద్వార్‌లో గంగా నదితో పాటు పలు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. సోమవారం (ఆగస్టు 4) కూడా అక్కడ భారీ వర్షాలు కురిశాయి. దీంతో, వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి రెండు దుకాణాలు నేలమట్టం అయ్యాయి. ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలో లేవ్డా నది, దాని ఉపనదుల్లో ఆదివారం ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. దీంతో, వరద ముప్పు ఏర్పడింది. ఈ ప్రభావంతో రాంపూర్–నైనిటాల్ ప్రధాన రోడ్, చకర్పుర్, లఖన్‌పుర్, మురియా పిస్టోర్, బర్హైనీ గ్రామాల్లోని చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లోని కొండప్రాంతాల్లో తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం మొత్తం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది.
Read also- Dhanush dating: ధనుశ్, మృణాల్ వీడియో వైరల్.. డేటింగ్ నిజమేనా?