Inspirational Story: ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన ప్రయాణం. అందులో ప్రతి అడుగు విజయం కాదు. అనూహ్యమైన మలుపులు ఎదురవ్వొచ్చు. కానీ, ప్రతి క్షణం నేర్చుకునే అవకాశం మాత్రం లభిస్తుంది. ప్రతి అవరోధం వ్యక్తుల బలాన్ని పరీక్షించే ఒక అవకాశమే అవుతుంది. దృఢమైన పట్టుదల, అంకితభావంతో ముందుకెళితే అసాధ్యమంటూ ఏమీ ఉండదు. లక్ష్యం ఎంత పెద్దదైనా, దూరంలో ఉన్నా, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని అడుగులు వేస్తే కలలు సాకారం అవుతాయి. కొన్నిసార్లు నిరాశ్యం కలిగినట్టు అనిపించినా, మన మార్గాన్ని మనమే తిరిగి సరిచేసుకుంటే విజయం తథ్యమని ఓ యువకుడు నిరూపించారు. అనారోగ్య సమస్యల కారణంగా 9వ తరగతిలోనే స్కూల్ మానేసిన ఓ విద్యార్థి నేడు ఏకంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా (Inspirational Story) అవతరించాడు.
స్కూల్ చదువు మధ్యలోనే వదిలేసి, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆ యువకుడి పేరు ధీరజ్. అతడు ప్రస్తుతం బెంగళూరు నగరంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. పట్టుదల, అంకితభావం ఉంటే సంక్షోభాలను దాటుకొని విజయాలు సాధించవచ్చునని నిరూపించాడు.
Read Also- GHMC: టార్గెట్ నెలకు రూ.100 కోట్లు… జీహెచ్‌ఎంసీ కీలక ప్రణాళిక!
అనారోగ్యానికి గురై స్కూల్‌కు వెళ్లడం మానేసి ధీరజ్ మిగతా పాఠశాల విద్యను ఇంటి వద్దే చదువుకుంటూ పాసయ్యాడు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ చేయాలని భావించాడు. కానీ, అనూహ్యంగా ఇంటర్‌లో కామర్స్‌లో చేరాడు. విజయవంతంగా పాసయ్యాడు. అనంతరం ఐఐటీ మద్రాస్ అందిస్తున్న డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్‌లో బీఎస్ డిగ్రీ చేయాలనుకున్నాడు. కానీ, మొదట ఇంగ్లిష్ లిటరేచర్ చదివేందుకు బీఏలో చేరాడు. అయితే, ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామ్ ధీరజ్‌కు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించింది. ఒకేసారి రెండో డిగ్రీ చదవడానికి మార్గం కల్పించింది.
Read Also- Akash Deep: ఇష్టమైన కారు కొనుక్కున్న భారత యువక్రికెటర్.. రేటు ఎంతంటే?
వికలాంగుల విభాగానికి చెందిన విద్యార్థి కావడంతో ధీరజ్‌కు 50 శాతం ఫీజు మినహాయింపు లభించింది. దీంతో, రెండు డిగ్రీలను చదవడానికి అవకాశం దక్కింది. మొత్తంగా ధీరజ్ నేడు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారిపోయాడు. ‘‘ఐఐటీ మద్రాస్ నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. జీవితానికి ఒక బలమైన లక్ష్యాన్ని ఇచ్చింది’’ అంటూ బీఎస్‌ఇన్‌సైడర్.ఇన్‌కు (bsinsider.in) ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీరజ్ వెల్లడించాడు. ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామ్, వాస్తవిక పారిశ్రామిక ప్రాజెక్టులతో ముడిపడిన నైపుణ్యాలను అందించిందని చెప్పారు.
అంకితభావంతో శ్రమించేతత్వం ఉన్న ధీరజ్, ‘థియరీ ఆఫ్ కంప్యూటేషన్’, ‘ఫిల్మ్ థియరీ’ వంటి ఎన్‌పీటీఈఎల్ (NPTEL) కోర్సులను కూడా పూర్తి చేశాడు. అంతేకాదు, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ కూడా చదివాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తూ, సాహిత్య పరిజ్ఞానాన్ని సాంకేతిక నైపుణ్యంతో జోడించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. మున్ముందు ఎంటెక్ లేదా ఎంఎస్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ధీరజ్ చెప్పాడు. ‘‘నిరుత్సాహపడకుండా లక్ష్యం పట్ల అంకితభావంతో ఉండండి. అందులోనే లీనమైపోండి.. మీరు స్మార్ట్‌గా తయారవ్వడమే కాదు, బలవంతులుగా మారతారు’’ అని విద్యార్థులకు ధీరజ్ సూచించాడు.