University in Jharkhand: జార్ఖండ్‌లోని కొల్హాన్ యూనివర్సిటీ.. పూర్వ విద్యార్థులకు మరోమారు పరీక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. 2017-24 మధ్య చదువుకున్న విద్యార్థులు తిరిగి వచ్చి పరీక్షలు రాయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ విద్యార్థులు తప్పనిసరిగా రాయాల్సిన రెండు జనరల్ ఎలెక్టివ్ (GE) పేపర్లలో ఒకదానిని మాత్రంమే కొల్హాన్ యూనివర్శిటి నిర్వహించింది. మరొకటి రాయించడంలో విఫలమైంది. దీంతో ఉద్యోగాలు పొందే విషయంలో పూర్వ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2017-24 మధ్య పట్టభద్రులైన డిగ్రీ స్టూటెండ్స్ తిరిగి వచ్చి పరీక్ష రాయాలని కొల్హాన్ విశ్వవిద్యాలయం కోరింది.
నోటిఫికేషన్‌లో ఏముందంటే?
జూలై 31న జరిగిన నిరసన, పలు విజ్ఞప్తుల తరువాత జార్ఖండ్ లోని కొల్హాన్ యూనివర్సిటీ (Kolhan University) ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు అంగీకరించింది. 2017-2024 బ్యాచ్ వరకు GE-2 పేపర్ రాయలేకపోయిన అందరు పట్టభద్రులు ఈ పరీక్షకు హాజరుకావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు. రిజిస్ట్రేషన్లు జూలై 28న ప్రారంభమై ఆగస్టు 16న ముగుస్తాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పర్షురామ్ సియాల్ (Parshuram Siyal) మాట్లాడుతూ ‘మునుపు సిలబస్‌లో ఎలాంటి సమస్య లేదు. GE-1 పేపర్‌ను నిబంధనల ప్రకారం నిర్వహించాం. కానీ కొంతమంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు GE-2 పేపర్ లేకపోవడంపై ప్రభుత్వ విభాగాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అందువల్ల ప్రత్యేక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం వచ్చింది’ అన్నారు.
పొరపాటు ఎలా జరిగిందంటే?
2015లో UGC ప్రవేశపెట్టిన కొత్త విధానం.. విద్యార్థులకు తమ కోర్ సబ్జెక్ట్ కాకుండా ఇతర విషయాలు ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఈ విధానంలో విద్యార్థులు నాలుగు సెమిస్టర్లలో GE-1, GE-2 అనే రెండు పేపర్లు పూర్తి చేయాలి. అయితే నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను కేవలం ఒక పేపర్‌కే హాజరు చేయించారు. ‘యూనివర్సిటీ నిర్వాహకులు GE-1, GE-2 రెండింటికీ విద్యార్థులు హాజరుకావలసి ఉందని గుర్తించలేదు. ఒక్క పేపర్‌కే పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇప్పుడు అదే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో టీచింగ్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని విద్యార్థి నాయకుడు సనతన్ పింగువా అన్నారు.
విద్యార్థులు ఏమంటున్నారంటే?
బాధిత విద్యార్థులు చెబుతున్నదాని ప్రకారం.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) 2015లో చాయిస్-బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రెండు జనరల్ ఎలెక్టివ్ (GE) పరీక్షలను తప్పనిసరిగా యూనివర్శిటీ నిర్వహించాల్సి ఉంది. కానీ జీఈ-2 నిర్వహించకపోవడంతో చాలా మందికి సమస్యగా మారింది. CBCS అమల్లో జరిగిన పొరపాటు వల్లే ఈ తప్పిదం జరిగినట్లు పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జీఈ 2 పరీక్ష వివరాలు.. మార్స్క్ మెమోలో లేకపోవడంతో ఉద్యోగాలు, ఇంటర్వ్యూలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్నారు.
పాస్ మార్కుల్లోనూ తేడాలు..!
ఈ లోపం వెలుగులోకి రావడం.. విద్యార్థులు రాష్ట్రం వెలుపల టీచింగ్ ఉద్యోగాలకు లేదా ఉన్నత విద్యకు దరఖాస్తు చేసేటప్పుడు వారి మార్క్‌షీట్లలో 8 పేపర్ల బదులు 7 పేపర్లు మాత్రమే ఉండటంతో వారికి సమస్యలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు పాస్ మార్కుల్లో కూడా తేడాలు ఉన్నాయని గుర్తించారు. బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగి అయిన కొల్హాన్ యూనివర్సిటీ పట్టభద్రుడు మాట్లాడుతూ ‘నాకు ఉద్యోగం పొందడంలో ఎలాంటి కష్టమూ రాలేదు. కానీ విశ్వవిద్యాలయం పొరపాటు వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసులు లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం హాజరయ్యేటప్పుడు చాలామందికి సమస్యలు రావచ్చు’ అని అన్నారు.
పరీక్ష చెల్లుబాటు అవుతుందా?
మరో విద్యార్థి నాయకుడు మంజిత్ హస్దా.. కొల్హాన్ యూనివర్శిటీ త్వరలో నిర్వహించబోయే పరీక్ష చెల్లుబాటుపై సందేహం వ్యక్తం చేశారు. ‘చాలా మంది విద్యార్థులు ఇప్పటికే మైగ్రేషన్ సర్టిఫికేట్ పొందారు లేదా ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ అయ్యారు. విద్యార్థి ప్రస్తుతం యూనివర్సిటీలో నమోదు కాని స్థితిలో ఉంటే ఈ యూనివర్సిటీ నిర్వహించే పరీక్షకు వారి అర్హతపై చట్టపరమైన సవాళ్లు రావచ్చు’ అని అన్నారు. ఈ లోపం బీఏ, బీఎస్సీ వంటి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులకు మాత్రమే కాకుండా B.Ed. కోర్సుకూ వర్తిస్తుందని పేర్కొన్నారు.
Also Read: 500 Women Tied Rakhi: సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కు రాఖీలు కట్టిన 500 మంది మహిళలు
టీచింగ్ ఉద్యోగాలకు ఆటంకం!
B.Ed. విద్యార్థి అనుజ్ పుర్టీ మాట్లాడుతూ ‘2015 నుండి NCTE మార్గదర్శకాల ప్రకారం B.Ed. రెండు సంవత్సరాల కోర్సులో రెండు ‘మెతడ్’ పేపర్లు తప్పనిసరి. కానీ కొల్హాన్ యూనివర్సిటీ ఒకదాన్నే అందిస్తోంది. రెండవ పేపర్ సిలబస్‌లో సంవత్సరాలుగా లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోతున్నారు’ అని చెప్పారు. బీఈడీ ఫైనల్ ఇయర్ విద్యార్థి కంచన్ లత స్పందిస్తూ ‘2015 నుండి యూనివర్సిటీ రెండవ ‘మెతడ్’ పేపర్‌ను ఎప్పుడూ నిర్వహించలేదు. దీని వల్ల చాలా మంది ప్రభుత్వ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోయారు’అని తెలిపారు.