GHMC: వార్షిక టార్గెట్ రూ.3 వేల కోట్లు
వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం రూ.2500 కోట్లు
జీఐఎస్ సర్వేలో గుర్తించిన ఆస్తుల ట్యాక్స్ రూ.500 కోట్లు
నెలకు రూ.వంద కోట్ల రాబడి ఉండాల్సిందే
లేని పక్షంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపులు కష్టమే
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీలో (GHMC) ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రతి నెలా రూ.400 కోట్లు సమకూరితే గానీ రొటీన్ మెయింటనెన్స్ ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌పైనే జీహెచ్ఎంసీ పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది. అందుకే ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు అవసరమైన రూ.136 కోట్లలో సింహభాగం రూ.వంద కోట్ల వరకు కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల ద్వారానే సమకూర్చుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైనట్లు సమాచారం.
ప్రతి నెల అన్ని సర్కిళ్ల నుంచి కలిపి ఖచ్చితంగా రూ.వంద కోట్ల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సిందేనని, లేనిపక్షంలో జీతాల చెల్లింపులు ఉండవన్న విషయాన్ని అధికారులు ఇప్పటికే సిబ్బందికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు టార్గెట్ రూ.2 వేల కోట్లుగా నిర్దేశించుకోగా, అధికారులు, సిబ్బంది అంచనాలన్నీ మించి రూ.2,038 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు అయింది. ప్రతిఏడాదీ.. క్రితం ఏడాది వసూలైన మొత్తం కలెక్షన్‌కు అదనంగా రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు పెంచి వర్తమాన ఆర్థిక సంవత్సరానికి టార్గెట్లు నిర్ణయిస్తుంటారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2500 కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌ను అధికారులు టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 1,200 కోట్ల వరకు వసూళ్లు దాటినట్లు తెలిసింది. ట్యాక్స్ చెల్లింపుల పరిధిలోకి రాని భవనాల నుంచి రూ.500 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరినాటి కల్లా సుమారు రూ.3 వేల కోట్ల మేర పన్ను వసూలు చేసే దిశగా అధికారులు వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
Read Also- Akash Deep: ఇష్టమైన కారు కొనుక్కున్న భారత యువక్రికెటర్.. రేటు ఎంతంటే?
ఆ ఆస్తుల నుంచి రూ. 500 కోట్లు
గతేడాది జులై మాసం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులపై నిర్వహిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సర్వేతో ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోని సుమారు 5 లక్షల నుంచి ఐదున్నర లక్షల వరకు ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకొచ్చి కనీసం రూ.500 కోట్ల వరకు వసూలు చేయాలన్న టార్గెట్‌తో అధికారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ టార్గెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.3 వేల కోట్లుగా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అంతేగాక, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల ఖచ్చితంగా రూ.వంద కోట్లు వసూలయ్యేలా ట్యాక్స్ వసూలు జరగాలంటూ ఆదేశించిన ఉన్నతాధికారులు…. నవంబర్ మాసం నుంచి డైలీ, వీక్లీ, నెలసరి టార్గెట్లు కూడా ఫిక్స్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also- 334 Parries Removed: 334 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఒకవైపు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) నిర్వహిస్తూనే ట్యాక్స్ చెల్లింపు పరిధిలోని రాని ఆస్తులు, అలాగే కమర్షియల్‌గా వినియోగిస్తూ, రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించాలని ఇప్పటికే కమిషనర్ ట్యాక్స్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు ఎవరూ నివాసం లేని భవనాలకు ట్రేడ్ లైసెన్స్ లను కూడా జారీ చేయాలని కమిషనర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ముగిసిన వెంటనే జనాలు నివాసం లేని భవనాలను గుర్తించి ట్రేడ్ లైసెన్స్ లను జారీ చేయటం, ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని భవనాలను గుర్తించి, వాటిని చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.