Income Tax Bill: ఆదాయ పన్ను చట్టం-1961 స్థానంలో ప్రవేశపెట్టేందుకుగానూ ఈ ఏడాది ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్-2025ను (Income Tax Bill 2025) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత.. దానిని క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును వెనక్కి తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఉపసంహరించుకున్న బిల్లును సెలెక్ట్ కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం సవరించిన నూతన వెర్షన్ బిల్లును సోమవారం (ఆగస్టు 11న) సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
కాగా, బీజేపీ నేత బైజయంత్ పాండా అధ్యక్షతన పనిచేసిన సెలెక్ట్ కమిటీ పలు కీలకమైన సిఫార్సులు చేసింది. దీంతో, ఆ సూచలన్నింటినీ కలిపి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఇప్పటికే రూపొందించారు. రకరకాల బిల్లులను సభలో ప్రవేశపెడితే జనాల్లో గందరగోళం నెలకొంటుందనే ఉద్దేశంతో, పాత దానిని పూర్తిగా ఉపసంహరించుకొని దాని స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని మార్పులు చేసిన సంపూర్ణ బిల్లును ఒకేసారి ప్రవేశపెట్టటం ద్వారా, పాత బిల్లు వల్ల నెలకొనే గందరగోళాన్ని తప్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.
బైజయంత్ పాండా ఏమన్నారు?
పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి అధ్యక్షత వహించిన బైజయంత్ పాండా ఈ బిల్లుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. నూతన బిల్లు చట్టరూపం దాల్చితే, పాత ట్యాక్స్ సిస్టమ్ సులభతరం అవుతుందని చెప్పారు. చట్టపరమైన గందరగోళాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఎంఎస్ఎంఈలకు (చిన్న, మధ్యతరహా సంస్థలు) అనవసరమైన న్యాయ సమస్యల (litigation) బాధలు తప్పుతాయని పేర్కొన్నారు.
Read Also- India Russia Oil: రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే.. భారత్‌కు జరిగే నష్టం ఎంతో తెలుసా?
పాత చట్టానికి 4 వేల సవరణలు
పాత ఆదాయపు పన్ను చట్టం అర్థం చేసుకోవడానికి చాలా సంక్లిష్టంగా ఉందని బైజయంత్ పాండా అన్నారు. నూతన బిల్లు చెల్లింపుదార్లుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టంపై (Income Tax Act, 1961) పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ బైజయంత్ పాండా స్పందిస్తూ, ఈ చట్టానికి ఇప్పటివరకు 4,000కి పైగా సవరణలు జరిగాయని వెల్లడించారు. ఈ చట్టంలో ఏకంగా 5 లక్షలకు పైగా పదాలు ఉన్నాయని, అందుకే ఇది చాలా క్లిష్టమైనదిగా మారిందని వ్యాఖ్యానించారు. పాత చట్టం స్థానంలో కొత్త బిల్లు అమల్లోకి వస్తే అంతా సరళీకృతమవుతుందని బైజయంతి పాండా పేర్కొన్నారు. దాదాపు 50 శాతం మేర చట్టం సరళీకృతం అవుతుందని పేర్కొన్నారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా సులభంగా చదివి అర్థం చేసుకోగలుతారని ఆయన చెప్పారు.
న్యాయ లేదా ఆర్థిక నిపుణుల సూచనలు, సలహాలు అవసరం లేకపోవడంతో చిరువ్యాపారాల యజమానులు, ఎంఎస్ఎంఈలకు ఈ చట్టం లాభదాయకంగా ఉంటుందని బైజయంతి పాండా ఆశాభావం వ్యక్తం చేశారు. పాత చట్టాల్లో పన్ను విధానాల్లో గందరగోళంగా ఉండేవని అన్నారు. ఉద్యోగులు, మధ్యతరగతి జనాలకు భారం కాని విధంగా పన్ను వ్యవస్థ తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించారు.
Read Also- US on IND PAK Ceasefire: ‘ఆపరేషన్ సిందూర్’పై అమెరికా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు