Russina-Crude-Oil
జాతీయం, లేటెస్ట్ న్యూస్

India Russia Oil: రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే.. భారత్‌కు జరిగే నష్టం ఎంతో తెలుసా?

India Russia Oil: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అయితే, దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. ఒకవేళ, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలును (India Russia Oil) ఆపివేస్తే మన దేశంపై ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది?, ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు ఎస్‌బీఐ రిపోర్టు సమాధానం ఇచ్చింది.

రష్యా నుంచి చౌక ధరకు లభిస్తున్న చమురు కొనుగోలును భారత్ ఆపివేస్తే.. చమురు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం వ్యయాలు భారీగా పెరిగిపోతాయని ఎ‌స్‌బీఐ రిపోర్ట్ హెచ్చరించింది. ఆర్థిక సంవత్సరం 2026లో చమురు దిగుమతుల వ్యయాలు 9 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ74,700 కోట్లు), వచ్చే ఆర్థిక సంవత్సరం 2027లో 12 బిలియన్ డాలర్ల మేర (సుమారు ఒక లక్ష కోట్లు పైగానే) వ్యయాలు పెరిగిపోతాయని విశ్లేషించింది.

అసలు వివాదం ఏమిటి?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక… ఉక్రెయిన్‌కు మద్దతుగా పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, చౌకగా లభిస్తుండడంతో 2022 నుంచి రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ ప్రారంభించింది. బ్యారెల్‌ క్రూడాయిల్ ధరను 60 డాలర్లకు తగ్గించి మనకు రష్యా విక్రయిస్తోంది. దీంతో, భారత్ తన ఇంధన వ్యయాలను భారీగా తగ్గించుకుంది. చౌకగా చమురు  కొనుగోలు ఒప్పందాలు జరిగిన తర్వాత, భారత్‌‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2020లో భారత ఆయిల్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా కేవలం 1.7 శాతంగా ఉండగా, ఆర్థిక సంవత్సరం 2025లో రష్యా వాటా ఏకంగా 35.1 శాతానికి పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారత్ మొత్తం 245 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోగా.. ఒక్క రష్యా నుంచే ఏకంగా 88 మిలియన్ మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకుంది.

Read Also- US on IND PAK Ceasefire: ‘ఆపరేషన్ సిందూర్‌’పై అమెరికా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక సంవత్సరం 2026 మధ్యలోనే రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ ఆపివేస్తే ఈ ఒక్క ఏడాదే 9 బిలియన్ డాలర్ల మేర వ్యయాలు పెరుగుతాయని ఎస్బీఐ రిపోర్టు అంచనా వేసింది. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇంకాస్త పెరిగితే భారత్‌పై భారం ఏకంగా 11.7 బిలియన్ డాలర్లకు (ఒక లక్షా 2 వేల 6 వందల కోట్లు) చేరుతుందని విశ్లేషించింది. ఎస్‌బీఐ రిపోర్ట్‌ని బట్టి చూస్తే రష్యా చౌక చమురు కారణంగా తక్కువ ధరలకే భారత్‌కు ఇంధనం లభిస్తోంది. కొనుగోలు చేయడం ఆపేస్తే దేశంపై ఆర్థిక భారం పెరిగే ముప్పు ఉంటుంది.

ఒక్క రష్యా మీదే ఆధారపడడం లేదు
ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు సప్లయ్‌లో రష్యా వాటా 10 శాతం వరకు ఉంటుంది. అనేక దేశాలు ఒకేసారి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే, ప్రపంచ చమురు ధరలు ఏకంగా 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ పరిణామం ఒక్క భారత్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. భారత్‌కు ఊరట కలిగించే ఏకైక అంశం ఏంటంటే, ముడి చమురు కోసం మన దేశం కేవలం రష్యాపై మాత్రమే ఆధారపడడం లేదు. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి చమురు సరఫరాదారుల నుంచి కూడా గణనీయ మొత్తం చమురును దిగుమతి చేసుకుంటోంది. మొత్తం 40 దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటోంది. ఆయా దేశాలతో వార్షిక ఒప్పందాలు ఉండటంతో అవసరమైతే చమురు దిగుమతి పరిమాణాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో గయానా, బ్రెజిల్, కెనడా ఉన్నాయి.

Read Also- Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?