US on IND PAK Ceasefire: ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సైనిక సంఘర్షణ ‘ఆపరేషన్ సిందూర్’పై (US on IND PAK Ceasefire) అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. దాయాదుల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను శాంతింపజేయడంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘ఈడబ్ల్యూటీఎన్’ ఛానెల్‌లో ‘ది వరల్డ్ ఓవర్’ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాకిస్థాన్ యుద్ధం వరకు వెళ్లడంతో మేము నేరుగా జోక్యం చేసుకున్నాం. ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో అధ్యక్షుడు ట్రంప్ విజయవంతమయ్యారు’’ అని రుబియో కొనియాడారు. అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని పరిష్కరించిన ఇతర అంతర్జాతీయ సమస్యలను ఆయన ప్రస్తావించారు. శాంతి పునరుద్ధరణ కోసం ట్రంప్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన విషయంలో అమెరికన్ల చాలా గర్వంగా ఉన్నారని రుబియో పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలోనే చూసుకుంటే, కాంబోడియా-థాయిలాండ్, అజర్‌బైజాన్-ఆర్మేనియా, డీఆర్‌సీ (డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)-రువాండా వంటి దేశాల మధ్య సమస్యలను కూడా పరిష్కరించగలిగారని రూబియో మెచ్చుకున్నారు. కాంగో-రువాండా యుద్ధం 30 ఏళ్లపాటు కొనసాగిందని, 70 లక్షల మంది మరణించారని, అంతటి శత్రుత్వం కలిగిన ఆ రెండు దేశాలను అమెరికా ఒక దారికి తీసుకొచ్చిందని, ఒప్పందం చేయించగలిగామని అన్నారు. మరిన్ని సమస్యలను పరిష్కరించడానికి అమెరికా సంసిద్ధంగా ఉందని, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తోందని వివరించారు.
Read Also- Wedding Dates: వచ్చే 3 నెలల్లో పెళ్లి ముహూర్తాలు.. కాదు కాదు చావుకే అంటోన్న నెటిజన్లు!
ట్రంప్ వాదనను ఇప్పటికే ఖండించిన భారత్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానంటూ ఈ ఏడాది మే 10 తేదీ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ‘‘మీరు యుద్ధం ఆపితేనే, మీ రెండు దేశాలతో అమెరికా వాణజ్యం చేస్తుంది. యుద్ధం ఆపకుంటే చేయదు అని హెచ్చరించాను’’ అని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అన్నారు. అయితే, ట్రంప్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. భారత్-పాక్‌కు చెందిన సైనిక అధికారుల మధ్య చర్చల ద్వారానే శాంతి స్థాపన జరిగిందని, అమెరికా జోక్యం లేదని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఇదే అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కూడా అధికారిక ప్రకటన చేశారు. బాహ్య ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌తో యుద్ధాన్ని భారత్ ఆపినట్టుగా వక్రీకరించడం పూర్తిగా తప్పు అని, ఆధారరహితమైనదని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్ సైనిక చర్యను ఆపలేదు. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. యుద్ధ మయంలో నిర్దేశించిన అన్ని రాజకీయ, సైనిక లక్ష్యాలు సంపూర్ణంగా సాధించాం. అందుకే తాత్కాలికంగా ఆపాం. భారత్‌కు వ్యతిరేకంగా ఏమైనా ఉగ్రవాద చర్యలు జరిగితే నిస్సంకోచంగా తిరిగి దాడి చేస్తాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
Read Also- Cyber Fraud: ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి.. రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు..!
కాగా, భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ (ceasefire) విషయంలో తనకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… భారత్ మీద కోపంగా ఉన్నారని దక్షిణాసియాకు చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. భారత్‌ను టార్గెట్ చేసుకొని, భారీగా సుంకాలు వడ్డించడానికి కారణాలు ఇవేనని విశ్లేషించారు.