Hyderabad Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే నగరంలో భారీ వర్షం మెుదలైంది. కూకట్ పల్లి, మూసాపేట్, జేఎన్ టీయూ, ఖైరతాబాద్, అమీర్ పేట్, కుత్బుల్లా పూర్, మెహదీపట్నం, మణికొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయం కావొస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ముందే చెప్పిన వాతావరణశాఖ
అంతకుముందు హైదరాబాద్ వాతావరణం కేంద్రం స్పందిస్తూ.. నగర వాసులకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్ లలో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5 – 4 సెం.మీ వర్షం పడుతుందని చెప్పింది. ఫలితంగా స్థానికంగా నీరు నిలిచి.. ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడే అవకాశమున్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Secunderabad Station: బిగ్ అలెర్ట్.. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే కష్టమే!
రాష్ట్రంలోని ఆ జిల్లాల్లోనూ వర్షం
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవాకశముందని తెలిపింది. అలాగే రాయలసీమ నుంచి సైతం కారు మబ్బులు తెలంగాణ వైపునకు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.