Cyber Criminals: 19వందల కోట్లు.. దేశవ్యాప్తంగా సగటున రోజుకు సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్న మొత్తం ఇది. ఒక్క మన రాష్ట్రం నుంచే రూ.58కోట్లు లూటీ చేస్తున్నారు. ఏటా పెరిగిపోతున్న(Cybercrime)సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా అత్యాశకు పోతున్న జనాలు సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. జీవిత కాలంపాటు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఆ తరువాత మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రకారం ఒక్క 2024లోనే సైబర్ క్రిమినల్స్ దేశం మొత్తం మీద 22,845 కోట్లను కొల్లగొట్టారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206శాతం ఎక్కువ కావడం, ఒక్క మన రాష్ట్రం నుంచే ప్రతీ సంవత్సరం సైబర్ మోసగాళ్లు 700 కోట్ల రూపాయలకు పైగా మోసాలు చేస్తుండడం గమనార్హం.
25 రకాలకు పైగా
డిజిటల్ అరెస్ట్, వర్క్ ఫ్రమ్ హోం, ఇన్వెస్ట్ మెంట్, కొరియర్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ ఇలా దాదాపు 25 రకాలకు పైగా సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం గతంలో జార్ఖండ్ రాష్ట్రం జాంతారా సైబర్ క్రిమినల్స్‌కు అడ్డాగా ఉండేది. ఫిషింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఈ ప్రాంతానికి పేరు పడిందంటేనే ఇక్కడి నుంచి జరుగుతున్న సైబర్ నేరాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, అస్సాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి కూడా పదుల సంఖ్యలో సైబర్ మోసగాళ్ల గ్యాంగులు నేరాలను ఆపరేట్ చేస్తున్నాయి.
Also Read: Central govt: చెప్పులు ఆధార్ కార్డులతో రైతులు క్యూ.. అధికారుల నిర్లక్ష్యం
ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ
ఇక, ఈ గ్యాంగుల్లో పని చేయాలంటే పెద్దగా విద్యార్హతలు అవసరం లేదు. టెన్త్, ఇంటర్ పాసైనా సరిపోతుంది. కాస్త చురుగ్గా ఉంటే చాలు. లీడర్లుగా పని చేసేవారు తమకు పనికి వస్తారనుకున్న యువకులను ఎంపిక చేసుకుని ఇంటర్ నెట్‌లోని సోషల్ ప్లాట్ ఫాంల ద్వారా ఎలా మోసాలు చేయాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. ఆ తరువాత ఒక్కొక్కరికి ఒక్కో ల్యాప్ టాప్ ఇచ్చి నేరాలు చేయిస్తున్నారు. దీని కోసం ఇండ్లు, అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఓ సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆజంఘడ్‌లో ఒకే ఒక్క భవనం నుంచి రెండు వందల మందికి పైగా సైబర్ క్రిమినల్స్ చాలా రోజులపాటు నేరాలకు పాల్పడ్డారు.
మన రాష్ట్రంలో
తెలంగాణలో కూడా ప్రతీ సంవత్సరం సైబర్ నేరాల (Cybercrime) సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 147 కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టారు. 2024 వచ్చేసరికి ఈ మొత్తం 300 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి పోలీసు ఉన్నతాధికారులు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయన్న దానిపై షార్ట్ వీడియోలు రూపొందించి వేర్వేరు సోషల్ ప్లాట్ ఫాంల ద్వారా జనానికి చేరవేస్తున్నారు. ఆయా కాలనీలు, బస్తీల్లో సమావేశాలు పెట్టి మరీ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.
మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇక, వేర్వేరు మొబైల్ కంపెనీలు, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులకు చెందిన నోడల్ అధికారులతో సమన్వయం ఏర్పరుచుకుని ఈ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైం పోలీస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అయితే జోనల్ వారీగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 880 మంది సిబ్బందిని సైబర్ వారియర్లుగా తీర్చిదిద్దారు. సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి? ఫిర్యాదు అందిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అన్నదానిపై వీరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
ఇంత చేస్తున్నా
ఇంత చేస్తున్నా సైబర్ నేరాలు(Cybercrime) మాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం జనంలోని అత్యాశే అని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. మేం చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించ వచ్చని, వర్క్ ఫ్రమ్ హోం చేసి వేలకు వేలు ఆర్జించండని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు వలలు విసురుతుంటే ఆశ పడుతున్న ఎంతోమంది వారి ఉచ్చులో చిక్కుకుంటున్నారన్నారు. మరికొందరు భయంతో కూడా కష్టార్జితాన్ని సైబర్ క్రిమినల్స్‌కు సమర్పించుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోల ఆధారంగా వస్తున్న బెదిరింపుల్లో ఇలా జరుగుతున్నదని వివరించారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటారని చెప్పారు.
గోల్డెన్ హవర్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసగాళ్ల వలలో పడి డబ్బు పోగొట్టుకుంటే మొదటి గంటలోనే 1930 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సైబర్ క్రైం అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు cybercrimes.gov.in అన్న వెబ్ సైట్‌కు వెళ్లి కూడా సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. అలా చేస్తే బాధితుడు ఏ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు క్రెడిట్ చేశాడో ఆ బ్యాంక్ తరపున ఉండే నోడల్ అధికారితో మాట్లాడి వెంటనే నగదును ఫ్రీజ్ చేయించడానికి అవకాశం ఉంటుందన్నారు. గంటకు పైగా గడిస్తే ఆ అకౌంట్ నుంచి డబ్బు వేరే ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందన్నారు.
Also Read: Hospital Constructions: మెడికల్ కాలేజీ ఆస్పత్రుల నిర్మాణ బాధ్యతలు..