Central govt: తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉంది. నీళ్లు, నిధులేకాదు, చివరకు వ్యవసాయ రంగంపైనా చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఎరువులకు సంబంధించిన ఇండెంట్‌ను కేంద్రానికి పంపింది. కానీ, కేంద్రం మాత్రం 2.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువగా సరఫరా చేసింది. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలకు మాత్రం వారు పంపిన ఇండెంట్ కంటే అదనంగా పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు వ్యవసాయశాఖ సైతం కేంద్రానికి వినతులు అందజేసి వారాలు, నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి మాత్రం స్పందన కరువైంది. తెలంగాణ రైతాంగం పక్షాన కొట్లాడాల్సిన కేంద్రమంత్రులు బండి, కిషన్ రెడ్డిల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు.
ఇండెంట్ పంపించినా పట్టించుకోరా
రాష్ట్ర ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ఈ వానాకాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సాగు అంచనాలు రూపొందించి కేంద్రానికి ఎరువులు ఇంత అవసరమని ఇండెంట్‌ను ప్రభుత్వం పంపించింది. కేంద్రం సైతం ఈ వానాకాలం 9.80లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ 2.40లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 10లక్షల మెట్రిక్ టన్నులు, మోనోక్రోటోపాస్ 55వేల మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్పీ లక్ష మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ప్రకటించింది.’
Also Read: Hydraa: ముష్కిన్ చెరువు పరిరక్షణకు హైడ్రా చర్యలు: కమిషనర్ రంగనాథ్
కేవలం 65వేల మెట్రిక్ టన్నులు
కానీ, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ నాలుగు నెలల్లో నెలలవారీగా చేయాల్సిన ఎరువులను సరఫరా చేయలేదు. ఏప్రిల్‌లో 1.70లక్షల మెట్రిక్ టన్నుల యూరియా (Urea) సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 1.21 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. డీఏపీ సైతం 50వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా 33వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2లక్షల మెట్రిక్ టన్నులు చేయాల్సి ఉండగా కేవలం 65వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. మే నెలలోనూ యూరియా 1.60లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా 88వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 60వేల మెట్రిక్ టన్నులకు గాను 38వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1.50లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.03 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేంద్రం సరఫరా చేసింది.
జూన్‌లో యూరియా 1.70లక్షల మెట్రిక్ టన్నులకు గాను 98వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 50వేల మెట్రిక్ టన్నులకు 49 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2లక్షల మెట్రిక్ టన్నులకు1.58 మెట్రిక్ టన్నులు, జూలైలో యూరియా1.60లక్షల మెట్రిక్ టన్నులకు గాను 89వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 30వేల మెట్రిక్ టన్నులకు గాను 41వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1.50లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.33లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 10వేల మెట్రిక్ టన్నులకు జీరో, ఎస్ఎస్పీ 20వేల మెట్రిక్ టన్నులకు గాను 7వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది.
ఈ నాలుగు నెలల్లో తెలంగాణకు కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా 6.60లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.97లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా సరఫరా చేయాల్సింది 2.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా. (Urea) అదే విధంగా డీఏపీ 1.90లక్షల మెట్రిక్ టన్నులకు 1.62 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 7లక్షల మెట్రిక్ టన్నులకు 4.58లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. ఎంవోపీ 33వేల మెట్రిక్ టన్నులకు కేవలం12వేల మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్పీ 69వేల మెట్రిక్ టన్నులకు సరఫరా చేసింది 23వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇది ప్రభుత్వం అధికారికంగా లెక్కలను వెల్లడించింది.
సీఎం విజ్ఞప్తి చేసినా
ఎరువులు సరఫరా చేయాలని కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వినతులు అందజేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) సైతం ఎరువులు కేటాయించిన విధంగా సరఫరా చేయాలని లేఖలు పంపారు. అయినా స్పందన కరువైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేంద్ర వివక్షతోనే సరఫరా చేయడం లేదని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఎన్డీఏ కూటములు ఉన్న రాష్ట్రాలకు మాత్రం ఆయా రాష్ట్రాలు పంపిన ఇండెంట్‌కు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు ఉన్నా
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఉన్నప్పటికీ రైతులు(Farmers)ఎరువుల కొరతతో పడుతున్న ఇబ్బందులపై స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తుందని పలు సందర్భాల్లో ప్రకటిస్తున్నప్పటికీ ఎరువుల సరఫరాపై స్పందించడం లేదు. రాష్ట్రం ఇచ్చిన ఇండెంట్‌కు అనుగుణంగా సరఫరా చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రమే ఎరువులు సరఫరా చేసేది అయినప్పటికీ మంత్రులుగా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువులు కేంద్రం ప్రకటించిన విధంగా ఒత్తిడి తెచ్చి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
అధికారుల వైఫల్యం?
కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటాను తెప్పించేందుకు అధికారులు నిత్యం మానిటరింగ్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే కొరతకు కారణమనే ప్రచారం జరుగుతున్నది. అంతేగాకుండా రాష్ట్రంలో సాకుకు తగిన ఎరువులు ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించడంలో ఫైల్ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంలో లోపాలు, ప్రచారం చేయడంలో వైఫల్యంతోనే రైతులు(Farmers) నిత్యం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ వద్ద రైతులు(Farmers) బారులు తీరున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఈ నెల 22న ప్రభుత్వమే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఎరువుల నిల్వలను అధికారికంగా ప్రకటించింది. యూరియా1,82,566 మెట్రిక్ టన్నులు, డీఏపీ 30,569 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,76,065 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 26,401 మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్పీ 19,935 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ రైతులు క్యూలో గంటల కొద్ది నిలబడడం, ఆధార్ కార్డులు, భూమి పాస్ బుక్‌లు పెట్టి ఎదురుచూడడం అధికారుల వైఫల్యమనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎరువుల నిల్వలపై ప్రచారంను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు గతంలో రాని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతీరోజు సుమారు రెండు లక్షల బస్తాల నుంచి మూడు లక్షల బస్తాల వరకు రైతులు ఎరువులను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: MLC Kavitha: ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే తప్పుల తడక: ఎమ్మెల్సీ కవిత