Hospital Constructions: మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రభుత్వం మళ్లీ తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కే అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చిన తర్వాత ఆర్ అండ్ బీ శాఖకు ఈ టాస్క్ ఇచ్చారు. అయితే, మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల నిర్మాణాల్లో ఆర్ అండ్ బీ పనితీరు సరిగ్గా లేదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మళ్లీ టీజీఎంఎస్ ఐడీసీకి బాధ్యతలు ఇస్తూ సర్కార్ తాజాగా ఆదేశించింది. వెంటనే మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల (Medical College) నిర్మాణాల (Hospital Constructions) ను చేపట్టాలని సూచించింది. దీంతో కార్పొరేషన్ కూడా ఈ నెల 18న టెండర్లను ఆహ్వానించింది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల నిర్మాణాలకు టెండర్ ప్రాసెస్ జరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఈ కాలేజీల్లోనే?
కొత్తగూడెం, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల మెడికల్ కాలేజీల(Medical College)కు అనుబంధంగా కార్పొరేషన్ శాశ్వత ప్రాతిపాదికన దవాఖాన్లను కట్టనున్నది. పేషెంట్లు, డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు ఇలా ప్రతి కేటగిరీకి నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు ఇంజినీర్లు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సర్కార్ నొక్కి చెప్పింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ఆయా ఆసుపత్రుల నిర్మాణాలపై ఫోకస్ పెంచారు. పైగా రాష్ట్రం ఏర్పడగానే ఫస్ట్ రౌండ్‌లో నిర్మించిన మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట్, సిద్ధిపేట్ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను మెడికల్ కార్పొరేషనే నిర్మించింది. అవన్నీ ఫర్ ఫెక్ట్‌గా కొనసాగుతున్నట్లు డీఎంఈ అధికారులు తెలిపారు. దీంతోనే ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్‌కే అప్పగిస్తూ తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
రెండో ఫేజ్ నుంచి అస్తవ్యస్తం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడో విడుతగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, నాలుగో విడతగా జోగులాంబ గద్వాల్,నారాయణ్ పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లా లోని కుత్భుల్లాపూర్‌లో మెడికల్ కాలేజీల కోసం గత సర్కార్ దరఖాస్తు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చిన తర్వాత అన్ని కాలేజీలకు ఎన్‌ఎంసీ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఆయా కాలేజీలను కొనసాగిస్తున్నది. అయితే, ఇందులో ఫస్ట్ ఫేజ్‌లో నిర్మించిన కాలేజీలు మినహా మిగతావాటికి శాశ్వత ప్రాతిపాదికన కాలేజీలు, ఆసుపత్రులు లేవు. అన్ని కాలేజీలను టెంపరరీ బిల్డింగ్‌లు, అటాచ్ ఆసుపత్రులతో నెట్టుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణాలను చేపడుతున్నది.
నిధులదే అసలైన సమస్య?
మెడికల్ కాలేజీల (Medical College) అనుబంధ అసుపత్రుల నిర్మాణ బాధ్యతలను కార్పొరేషన్‌కు ఇచ్చినప్పటికీ.. నిధులపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఒక్కో ఆసుపత్రి నిర్మాణం, ఎక్విప్‌మెంట్, పర్మిచర్ కొనుగోలుకు సుమారు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు అవుతుందని అధికారుల అంచనా. అన్నింటికీ కలిపి దాదాపు రూ.1500 కోట్లు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. దీంతో భారీ స్థాయిలో నిధులను ఎలా సమకూర్చుకోవాలని కార్పొరేషన్ ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తే కానీ, నిర్మాణాలు స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మెడికల్ కార్పొరేషన్ అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది. నిధులు వెంటనే సమకూర్చితే, దవాఖాన్ల నిర్మాణాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని ఓ అధికారి తెలిపారు.
Also Read: Telangana Tourism: టూరిజం పాలసీలో భాగంగా అభివృద్ధికి శ్రీకారం