Artificial Sweeteners: మధుమేహం బారిన పడ్డవారు స్వీట్లు అసలు తినకూడదని వైద్యులు చెబుతుంటారు. అయితే తీపికి దూరమై బాధపడుతున్న షుగర్ పెషెంట్స్ కోసం.. కృత్రిమ స్వీటెనర్లు (Artificial Sweeteners) ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. షుగర్ లెవెల్స్ ను పెంచే చక్కెరకు బదులుగా.. ఎరిథ్రిటాల్ (Erythritol), జైలిటాల్ (Xylitol), ఆస్పర్టేమ్ (Aspartame), ఎసిసల్ఫేమ్ పొటాషియం (Acesulfame Potassium), సుక్రలోజ్ (Sucralose) వంటి వాటితో ఈ కృత్రిమ స్వీటెనర్లు తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల తీపి తిన్నామన్న కోరిక తీరడంతో పాటు.. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ కృత్రిమ స్వీటెనర్లపై తాజాగా నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇవి గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది.
గుండెకు ముప్పు
నేచర్ మెడిసిన్ (Nature Medicine) జర్నల్‌లో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ (Cleveland Clinic) కు సంబంధించి ఓ అధ్యయనం ప్రచురితమైంది. దీని ప్రకారం కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తేలింది. ఎరిథ్రిటాల్ వంటి కృత్రిమ స్వీటెనర్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నట్లు స్డడీలో వెల్లడైంది. ఎరిథ్రిటాల్, జైలిటాల్ వంటి స్వీటెనర్లు రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను సులభంగా గడ్డకట్టేలా చేస్తున్నట్లు వెల్లడైంది. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఎరిథ్రిటాల్ శరీరంలో సహజంగా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయని కానీ కృత్రిమంగా తీసుకున్నప్పుడు రక్తంలో దాని స్థాయిలు వెయ్యి రెట్లు పెరుగుతున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని రోజుల పాటు అవి రక్తంలోనే పేరుకుపోతున్నట్లు స్పష్టమైంది. అంతేకాదు కృత్రిమ స్వీటెనర్లు శరీరంలో సరిగ్గా జీర్ణం కావని.. రక్తంలో చేరి మూత్రం ద్వారా విసర్జింపబడతాయని తాజా స్టడీ తెలియజేసింది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పేర్కొన్నారు.
ఇతర స్టడీలు ఏం చెబుతున్నాయి?
2022లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురితమైన న్యూట్రినెట్-సాంటే స్టడీ ప్రకారం.. ఆస్పర్టేమ్, ఎసిసల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్ వంటి స్వీటెనర్లు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 9%, స్ట్రోక్ ప్రమాదాన్ని 18% పెంచుతాయని తేలింది. 2025లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ స్టడీ.. ఎరిథ్రిటాల్ మెదడు రక్తనాళాల కణాలను దెబ్బతీసి, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చూపించింది. అయితే కృత్రిమ స్వీటెనర్ల గురించి ఇప్పటివరకూ వచ్చిన అధ్యయనాలు పరిశీలనాత్మకమైనవి మాత్రమే. కృత్రిమ స్వీటెనర్లు నేరుగా గుండెపోటు, స్ట్రోక్ కు కారణమవుతున్నట్లు ఎక్కడా నిరూపితం కాకపోవడం గమనార్హం.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన ఫారెస్ట్ యంత్రాంగం.. అటవీ భూమి ఆక్రమణలకు చెక్!
నిపుణుల సలహాలు
డయాబెటిస్ లేదా గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు ఎరిథ్రిటాల్, జైలిటాల్ వంటి స్వీటెనర్ల వాడకాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వీటెనర్లను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ లెబుల్స్ ను తప్పని సరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. చాలా ఉత్పత్తుల్లో ఈ స్వీటెనర్లు.. ‘షుగర్ ఆల్కహాల్స్’ లేదా ‘జీరో షుగర్’ అని పేర్కొనబడి ఉంటాయి. వాటి తయారీకి ఉపయోగించిన పదార్థాలు లేబుల్స్ లో లిస్ట్ చేయబడి ఉండవు. కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ స్వీటెనర్లకు ప్రత్యామ్నాయంగా స్పార్క్లింగ్ వాటర్, 100 ఫ్రూట్ జ్యూస్ లేదా సహజమైన స్వీటెనర్లను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.