GHMC: ప్రతి ఆర్థిక సంవత్సరం వేల కోట్ల బడ్జెట్‌తో గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు కోటిన్నర మంది ప్రజలకు అత్యవసర సేవలు అందించే జీహెచ్‌ఎంసీ(GHMC)లో మరోసారి ఛాంబర్ల కొరత సమస్య తలెత్తింది. కొంతకాలం క్రితం అదనపు కమిషనర్ల సంఖ్య పరిమితికి మించి ఉండటంతో ఈ సమస్య తలెత్తింది. దీనికి చెక్ పెట్టేందుకు అప్పటి కమిషనర్ కర్ణన్(RV. Karnan) ఏకంగా అదనపు కమిషనర్ల సంఖ్యను కుదిస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కొందరు అదనపు కమిషనర్లను ఏకంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA)కు సరెండర్ కూడా చేశారు. అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించుకుంటే ఛాంబర్ల కొరత సమస్య పరిష్కారమవుతుందని కమిషనర్ కర్ణన్ భావించినా ఆయన అంచనాలన్నీ తారుమారయ్యాయి.
అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించడంతో పాటు కొందరు అధికారులను అదనపు కమిషనర్ స్థాయి నుంచి జాయింట్ కమిషనర్‌గా డిమోషన్ చేయడంపై కొందరు అధికారులు జీర్ణించుకోలేకపోయారు. జాయింట్ కమిషనర్‌గా పని చేయడం ఇష్టం లేక లాంగ్ లీవ్‌లు పెట్టి వెళ్లిపోగా, అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన మరికొందరిని ముఖ్యమైన విభాగాలకు జాయింట్ కమిషనర్‌గా నియమించినా, వారికి ప్రధాన కార్యాలయంలో ఛాంబర్లు లేకపోవడంతో వారు ఉదయం వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్లిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఛాంబర్లు లేక డ్యూటీకి డుమ్మా..
కొద్ది రోజుల క్రితం వరకు డిప్యూటీ కమిషనర్ విధులు నిర్వర్తించిన ఓ అధికారికి మూడు జోన్ల శానిటేషన్ బాధ్యతలను అప్పగిస్తూ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఆయనతో పాటు మరో అధికారిని కూడా జాయింట్ కమిషనర్-2 (శానిటేషన్)గా నియమించినా, వీరిద్దరికీ ప్రధాన కార్యాలయంలో ఛాంబర్లు లేక ఆఫీసుకు వచ్చి వెళ్తున్నట్లు సమాచారం.
Also Read: BRS Party: కారును పోలిన గుర్తులు తొలగింపుపై ఈసీపై ఒత్తిడి
కొందరికి డబుల్ ఛాంబర్లు
ఇదిలా ఉండగా, క్యాడర్, నాన్-క్యాడర్ అదనపు కమిషనర్ల ఛాంబర్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అదనపు కమిషనర్ (ఐటీ, రెవెన్యూ)గా వ్యవహరిస్తున్న ఓ క్యాడర్ ఆఫీసర్‌కు ప్రధాన కార్యాలయంతో పాటు ఖైరతాబాద్(Khairathabadh) జోనల్ బాధ్యతలను కూడా అప్పగించడంతో ఆయనకు జోనల్ స్థాయిలో, హెడ్ ఆఫీసులోనూ ఛాంబర్లను కేటాయించారు. అలాగే మరో క్యాడర్ మహిళా అధికారికి సైతం బుద్ధభవన్ తో పాటు ప్రధాన కార్యాలయంలోనూ ఛాంబర్లను కేటాయించారు. ఈ ఇద్దరు ఆఫీసర్లు ఎప్పుడు ఏ ఆఫీసులో అందుబాటులో ఉంటారో తెలియక సందర్శకులు అయోమయానికి గురవుతున్నారు. ఇలా జీహెచ్‌ఎంసీ(GHMC)లో కొందరు ఆఫీసర్లకు రెండేసి ఛాంబర్లను కేటాయించినా, మరికొందరు జాయింట్ కమిషనర్లకు అసలు ఛాంబర్లే అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఛాంబర్ ఉన్నా.. సీట్లో లేని ఆఫీసర్లు
కమిషనర్ ఇటీవలే చేపట్టిన బదిలీల్లో భాగంగా మొత్తం గ్రేటర్ హెల్త్ వింగ్‌కు జాయింట్ కమిషనర్‌గా నియమించిన ఆఫీసర్‌కు ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులో ఛాంబర్ ఉన్నా, ఆయన ఎప్పుడూ ఆఫీసులో గానీ, సీట్లో గానీ అందుబాటులో ఉండకపోవడంతో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నందున కింది స్థాయి సిబ్బంది కూడా బేజారవుతున్నారు. అసలే వర్షాకాలం, చిరుజల్లులు కురిసి రోడ్లపై నీరు రోజుల తరబడి నిలబడే పాయింట్లను ఇప్పటికే గుర్తించిన ఎంటమాలజీ విభాగం దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాల్సి ఉన్నా, సదరు హెల్త్ వింగ్ జాయింట్ కమిషనర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సీటులో దర్శనమివ్వలేదని ఆయన చాంబర్ సిబ్బందే బహిరంగంగా చర్చించుకోవడం కనిపించింది. ఇక ఛాంబర్లు లేక డ్యూటీలో ఉన్న అధికారులు ఎప్పుడు వస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
Also Read: Indira Mahila sakthi: అతివలకు అండగా.. ఇందిరా మహిళా శక్తి