Indira Mahila sakthi: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, వారిని కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి (Indira Mahila sakthi) సంబురాల కార్యక్రమానికి వారు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్యలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
Also Read: Indira Mahila Shakti Vijayotsavam: ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సంబురాల ఏర్పాట్లు
ఈ సందర్భంగా కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాలంబన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాల పాలనలో రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీశారు తప్ప, ఏ ఒక్కరికీ డబుల్ బెడ్‌రూములు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఖజానాను దివాలా తీయించారని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు.
జిల్లాకు 13,000 కొత్త రేషన్ కార్డులు..
గత పది సంవత్సరాలలో జిల్లాలో, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డును కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా (Sangareddy) సంగారెడ్డి జిల్లాకు 13 వేల పైచిలుకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) తెలిపారు. త్వరలో లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డులను అందజేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ కార్డు హామీల్లో భాగంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 రాయితీ, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
అదనంగా, అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో మౌలిక వసతుల మెరుగు కోసం కృషి చేస్తోందని, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో క్యాంటీన్ల ఏర్పాటు, రాష్ట్రంలోనే మొదటి పెట్రోల్ పంపు సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వాలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మహిళలతో పాఠశాల గదుల నిర్మాణం, కళాశాల గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు సైతం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారతతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పీడీ డీఆర్డీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన