Indira Mahila Shakti Vijayotsavam: మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను అందించి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా సాధికారతకు గుర్తుగా ప్రభుత్వం ‘ఇందిర మహిళా శక్తి విజయోత్సవం’ పేరిట సంబురాలను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి ఈ నెల 23 వరకు నిర్వహిస్తున్న ఈ సంబురాలలో జిల్లా వ్యాప్తంగా 16,027 మహిళా సంఘాలకు రూ.16.09కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు.
ఇతోధికంగా రుణాలు
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 16వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు(Self-Help Groups) ఉన్నాయి. మహిళల ఆర్థిక అభివృద్దికి ప్రతి యేటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి స్వావలంభనకు తోడ్పాటునందిస్తోంది. ప్రతియేటా రుణ ప్రగతిలో జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందుతుండడంతో అదే ఉత్సాహంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ విరివిగా రుణాలు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, కిరాణ దుకాణాలు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫుట్‌వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందించారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేశారు.
గతంలో రూ.50వేల నుంచి రూ.5లక్షల లోపుననే మహిళా సంఘాలకు రుణం ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.20లక్షల వరకు అర్హతను బట్టి రుణాలను మంజూరు చేస్తూ వస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 15,571 సంఘాలకు రూ.959కోట్ల 18లక్షల రుణాలను అందజేశారు. రుణ లక్ష్యం రూ.850కోట్లకు మించి 112 శాతం రుణాలను అందించారు. రుణాలు ఇవ్వడమే కాకుండా..సకాలంలో తిరిగి రుణాలు చెల్లించడం వంటి అంశాలపైననూ సంబంధిత అధికారులు మహిళలకు అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లిస్తున్నాయి. దీంతో రుణాల రికవరీలోనూ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉంది.
Also Read: Telangana: డేటా సిటీగా హైదరాబాద్ మారనుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేటి నుంచి వడ్డీలేని రుణాల పంపిణీ
మహిళా సంఘాలకు చేయూత నందించడంలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పభుత్వం రంగారెడ్డి జిల్లాకు రూ.16.09కోట్లను విడుదల చేసింది. సంబంధిత నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(SERP)కి విడుదల చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే విజయోత్సవాలలో నిర్దేశిత షెడ్యూల్‌ను అనుసరించి సంబంధిత చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్నారు. 17న చేవెళ్ల(Chevella) నియోజకవర్గంలో నిర్వహించే సంబురాల్లో 3,441 మహిళా సంఘాలకు రూ.3.58కోట్ల చెక్కులను పంపిణీ చేయనున్నారు.
18న మహేశ్వరం నియోజకవర్గంలో 2,134 సంఘాలకు రూ.2.09కోట్లు, కల్వకుర్తి నియోజకవర్గంలో 2,409 సంఘాలకు రూ.2.30కోట్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,642 సంఘాలకు రూ.3.93కోట్లు, షాద్ నగర్ నియోజకవర్గంలో 3,418 సంఘాలకు 3.29కోట్లు, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 983 సంఘాలకు రూ.90లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.
Also Read: TDP: జగన్‌కు ఇచ్చి పడేసిన టీడీపీ.. బాబోయ్ ఇవేం కౌంటర్లు!